Gruha Lakshmi Scheme Guidelines: ఆహార భద్రతా కార్డు ఉంటేనే రూ.3 లక్షలు, తెలంగాణ గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలు, అర్హతలు ఇవిగో..
గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
Guidelines for Gruha lakhmi housing scheme: సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
దీని ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్లు, మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4లక్షల ఇండ్లు నిర్మాణానికి 7,350 కోట్లు ఖర్చు కేసీఆర్ సర్కారు చేయనుంది.ఈ మేరకు గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో ఎంఎస్25ని ప్రభుత్వం విడుదల చేసింది.
పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వంచే ఆమోదించబడిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయనుండగా.. సంబంధిత కుటుంబం ఫుడ్ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలని సూచించింది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్‌ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో పథకం అమలు చేయనున్నారు. రెండు గదులతో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది.
మహిళా పేరు మీదనే ఇల్లు మంజూరవుతుంది. లబ్దిదారులు తమకు ఇష్టమైన డిజైన్ ఎంపికకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా దరఖాస్తులు జిల్లా కలెక్టర్లు స్వీకరించనున్నారు. లబ్ధి దారుల ఎంపికలో స్క్రూటినీ చేసి, లబ్ధి దారులను కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. దశల వారీగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఇళ్లను మంజూరు చేస్తారు.
గృహలక్ష్మి పథకం అమలంతా ఆన్‌లైన్‌లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహలక్ష్మి పథకం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌తో పాటు, మొబైల్ యాప్‌ను ప్రభుత్వం సిద్దం చేయనుంది. మూడు దశల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు పంపిణీ చేయనుంది. మొదటి దశలో బేస్మెంట్ లెవెల్ స్టేజ్ రూఫ్ తోపాటు పనులు పూర్తయిన తర్వాత మొత్తం అమౌంట్ అందజేయనుంది. ఇంటి బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు దశలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష చెల్లిస్తారు.
అర్హతలు, మార్గదర్శకాలు..
1. గృహలక్ష్మి ఇంటిని మహిళ పేరిటే మంజూరు చేస్తారు.
2. ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఖాళీ జాగా ఉండాలి.
3. లబ్ధిదారుడు లేదా ఆ కుటుంబ సభ్యుల పేరిట ఆహార భద్రతా కార్డు ఉండాలి.
4. లబ్దిదారుడు తనకు నచ్చిన డిజైన్‌లో ఇంటిని నిర్మించుకోవచ్చు.
5. ఈ పథకం రెండు పడకల ఆర్సీసీ ఇంటి నిర్మాణానికే వర్తిస్తుంది.
6. లబ్ధిదారుడు అదే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.
7. ఆధార్/ఓటర్ ఐడీకార్డులు ఉండాలి. బ్యాంకులో ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలి.
8. ఇప్పటికే ఆర్సీసీ రూఫ్‌తో కూడిన ఇల్లు ఉన్నా, జీవో 59 కింద లబ్ధి పొందినా పథకం వర్తించదు.
9. ప్రతి నియోజకవర్గంలోని లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీ, మైనార్టీలు కలిపి 50 శాతం ఉండాలి.
10. నిధుల విడుదల అధికారం కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌దే.
11. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక 'గృహలక్ష్మి' లోగోను తప్పనిసరిగా అతికించాలి.