Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం, టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన, భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేద్దామంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ సవాల్
తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని (YSR Congress denies CM Remarks) అన్నారు.
Tirupati, Sep 19: తిరుమల శ్రీవేంకటేశ్వరసామి లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం (Tirupati Laddu Controversy) రేపుతున్నాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌హాల్‌లో నిన్న ఎన్డీయే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పవిత్ర తిరుమల ఆలయాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని పేర్కొన్నారు.
ప్రసాదంలో నాణ్యతలేని పదార్థాలను ఉపయోగించిందని ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలు శ్రీవారి భక్తులనే కాదు.. అందరినీ షాక్‌కు గురిచేశాయి. ‘‘వైసీపీ హయాంలో నాణ్యత లేని పదార్థాలను వాడడమే కాదు.. లడ్డు ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు. ఇది తిరుమలను అపవిత్రం చేసింది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని (YSR Congress denies CM Remarks) అన్నారు. ఈ ప్రపంచంలో పుట్టిన వారెవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి ఆరోపణలు చేయరని, రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతవరకైనా దిగజారుతారని మరోమారు రుజవైందని మండిపడ్డారు. ఈ విషయంలో తాను తన కుటుంబంతో కలిసి భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కూడా అలా చేయడానికి సిద్ధమా? అని సవాలు విసిరారు.
కాగా, ఈ ఏడాది జులైలో నాసిరకం నెయ్యిని సరఫరా చేసినందుకు ఓ కాంట్రాక్టర్‌ను టీటీడీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఆ తర్వాత బెంగళూరులోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) లిమిటెడ్ హై-గ్రేడ్ నెయ్యిని ప్రవేశపెట్టింది. కాంట్రాక్టర్ కల్తీనెయ్యిని సరఫరా చేసినట్టు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) నిర్ధారించింది.
తిరుమల లడ్డూపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. ఒక కంపెనీ నెయ్యిలో వెజిటబుల్ కొవ్వు కలిసిందని ఈవో చెప్పుకొచ్చారు. టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమల లడ్డూ కోసం ఉపయోగిస్తున్న వాటిలో ఒక కంపెనీ నెయ్యిలో వెజిటబుల్ కొవ్వు కలిసిందని చెప్పుకొచ్చారు.
తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు అంటూ కామెంట్స్ చేశారు.కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష ప్రచారం తగదు చంద్రబాబు. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారికి శ్రీ వైష్ణవులు ఎంతో శుద్ధిగా వాటిని తయారు చేస్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి ప్రత్యేకమైన దిట్టం ఉంది. దాని ప్రకారమే ప్రసాదాలు తయారు అవుతాయి. వీటిలో ఎవరి జోక్యం ఉండదని భూమన అన్నారు.
2014-19 టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన కంపెనీలే 2019-24 లోనూ మెజారిటీ సంస్థలు నెయ్యి సరఫరా చేశాయి. అప్పటి నాణ్యత మా ప్రభుత్వం పాలనలో లేదని చెప్పడం అంటే ఇది చంద్రబాబు నీచ రాజకీయాలకు ఉదాహరణ. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలు దృష్టి మరల్చడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు.
చంద్రబాబు జీవితం అంత విష ప్రచారం, నీచ రాజకీయాలు చేయడమే. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. కనీసం ఇంట్లో ఉన్న వేంకటేశ్వర స్వామి చిత్ర పటం ముందుకు వెళ్లి అయినా క్షమాపణ కోరి, పశ్చాతాపం చేసుకో చంద్రబాబు అంటూ భూమన ఘాటు విమర్శలు చేశారు.