TTD Immovable Assets Row: వెంకన్నకు భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులు అమ్మకుండా శ్వేతపత్రం, డిసెంబర్ 25 నుంచి వైకుంఠ దర్శనం, కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలక మండలి
కోవిడ్ ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవడం వంటి కీలక అంశాలే ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశం అయింది.
Amaravati, Nov 29: కోవిడ్ ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవడం వంటి కీలక అంశాలే ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశం అయింది. కరోనా మార్గదర్శకాల మేరకు భక్తుల సంఖ్య కుదించడంతో తగ్గిన ఆదాయాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో ఇందులో చర్చించారు. కార్పస్‌ఫండ్ నుంచి నిధుల డ్రా, భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతించడంతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతించే విషయమై నిర్ణయం తీసుకోన్నారు.
శ్రీవారి ఆలయ మహాద్వారం తలుపులకు ఆరున్నర కిలోల బంగారంతో తాపడంతో పాటు మొత్తం 107 అంశాలపై భేటీలో చర్చ జరిగింది. సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డితో పాటు ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో హైలెట్స్ : భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులను (TTD Immovable Assets Row) అమ్మడానికి వీలు లేకుండా శ్వేత పత్రం విడుదల చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తెలిపారు. తిరుమలలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారానికి బంగారు తాపడంపై చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్ సెక్యూరిటీ వారికి యూనిఫాం అలవెన్స్ గా రెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. కాలు నడక భక్తుల కోసం షెల్టర్ కూడా ఆధునీకరణ పనులు చేపడుతున్నాం. గాలి గోపురాల మరమ్మత్తులకు నిధుల కేటాయించామని ఛైర్మెన్ అన్నారు.
తిరుమలలో ( Tirumala temple) పర్యావరణాన్ని కాపాడటంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాం. తిరుమలను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతాం. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు 100 నుండి 150 బస్సులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా తిరుమలలో గ్రీన్‌పవర్ వాడేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానించారు.
ఇక డిసెంబరు 25 నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచే ఉంచాలని భక్తులు కోరారని, ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి దేశంలోని ప్రధాన పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వైవీ తెలిపారు. పది రోజులపాటు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. హైకోర్టు సూచన ప్రకారం టీటీడీ బోర్డు సభ్యులతో ఉపకమిటీని ఏర్పాటుచేసి, కంచి, శృంగేరి, త్రిదండి, శారదాపీఠం తదితర ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు 26మందితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సూర్యప్రభ వాహనానికి 11.76 లక్షల బంగారు తాపడం కోసం నిధులు కేటాయించాం. సాధారణ భక్తులకు కేటాయించే కాటేజీల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నాం. ధర్మ రథాలు ధర్మ ప్రచార పరిషత్ కోసం తిరిగి ప్రారంభిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో పేదల వివాహం కోసం కల్యాణ మండపాల్లో కల్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభిస్తాం. బాల మందిరాల్లో అనాధ పిల్లల సౌకర్యార్థం పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. చెన్నై వలందురు పేటలో నాలుగు ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. జాతీయ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లోనే టీటీడీ డిపాజిట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నామని’’ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.