Machilipatnam, Nov 29: వైసీపీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పేర్ని నానికి తృటిలో ప్రమాదం (Attacking On Minister Perni) తప్పింది. మచిలీపట్నంలోని (Machilipatnam) మంత్రి నివాసంలో ఓ దుండగుడు తాపితో దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో ఆయన చొక్కా చిరిగిపోయింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఆయన తన నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మంత్రి కాళ్లకు దండం పెట్టడానికి వెళ్లిన అతను అనూహ్యంగా ఆయనపై దాడికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న తాపీతో కొట్టబోయాడు. సకాలంలో అతని కదలికలను గుర్తించిన అనుచరులు ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా..పట్టుకున్నారు. దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. కాగా.. అతని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతని నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. ఈ రోజు అమ్మ పెద్దకర్మ ఉండటంతో పూజాధికాలు పూర్తి చేసుకొని కార్యక్రమానికి వచ్చిన ప్రజలను పలకరిస్తున్నాను. ఇదే క్రమంలో ప్రజలతో మాట్లాడుతూ భోజనాల దగ్గరకు వెళ్లాలని గేటు దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాళ్ల మీద పడుతున్నట్లుగా ఇనుప వస్తువుతో నా మీద దాడికి ప్రయత్నించాడు. అది బెల్ట్ బకెల్‌కి తగలడంతో నాకు ఎటువంటి ప్రమాదం కాలేదు. ఈ లోపు అప్రమత్తమైన చుట్టూ ఉన్నవారు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నేను క్షేమంగానే ఉన్నాను.. ఏమీ జరగలేదు' అని మంత్రి తెలిపారు
ఇదిలా ఉంటే మచిలీపట్నంలోనే పేర్నినాని అనుచరుడొకరు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మోకా భాస్కర్ రావును ఆయన ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ హత్యకు, పేర్నినాని మీద చోటు చేసుకున్న హత్యాయత్నానికి సంబంధాలు ఏవైనా ఉన్నాయోమోననే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. పేర్నినాని అనుచరుడు హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్టయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.