Dial Your EO Program: శ్రీవారి భక్తులకు శుభవార్త, తెరుచుకోనున్న వైకుంఠ ద్వారం తెలుపులు, డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు భక్తులకు దర్శనభాగ్యం, రోజుకు 20 వేలు చొప్పున ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంట ద్వారం తలుపులు (Vaikuntha Gate of Srivari Temple) తెరిచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి (TTD EO Dr. KS Jawahar Reddy) తెలిపారు.
Tirumala, Dec 12: తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారం తలుపులు తెరుచుకోనున్నాయి. వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంట ద్వారం తలుపులు (Vaikuntha Gate of Srivari Temple) తెరిచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి (TTD EO Dr. KS Jawahar Reddy) తెలిపారు.
ఇందుకోసం రోజుకు 20 వేలు చొప్పున ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు పదివేల టికెట్లు ఈ నెల 24న భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో (Dial Your EO Program) టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఈ విషయాలను తెలిపారు.
ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం సేవ బదులు తిరుప్పావై పఠనం జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 14 నుండి జనవరి 7వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను ఆలయంలోని రంగనాయకుల మండపంలో 25 రోజుల పాటు శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30న ప్రణయ కలహోత్సవం జరుగనుంది. శ్రీవారు తన దేవేరులతో కలిసి ఈ ఉత్సవంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదం అందిస్తామని సోషల్ మీడియాలో నకిలీ వెబ్‌సైట్లు చేసుకుంటున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఈఓ జవహర్‌రెడ్డి భక్తులను కోరారు. శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్‌సైట్ www.tirupatibalaji.ap.gov.inను మాత్రమే వినియోగించాలని సూచించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లోని గదులను డిసెంబరు 15వ తేదీ నుంచి భక్తులకు కేటాయిస్తాం. డిసెంబరు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో ఈ గదులను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామని ఈఓ స్పష్టం చేసారు.
దీంతో పాటుగా తిరుమలలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో పవిత్ర ఉద్యానవనాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గోసంరక్షణ కోసం డిసెంబరు 7న విజయవాడ కనకదుర్గ ఆలయంలో, 10న హైదరాబాద్‌లోని శ్రీవారి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించామని టీటీడీ ఈవో తెలిపారు. డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు కవచ సమర్పణ జరిగిన తరువాత మహాసంప్రోక్షణ వరకు బాలాలయంలో స్వామివారికి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.
టీటీడీ కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు తిరుమల వసంత మండపంలో అశ్వత్థపూజ, సాలగ్రామ పూజ, రాధా దామోదర వ్రతం, తులసీ ధాత్రీ దామోదర వ్రతం, గోపూజ, విష్ణు పూజలు, వ్రతాలు నిర్వహిస్తోంది. తిరుపతి కపిల తీర్థం ఆలయ ప్రాంగణంలో 14 రోజుల పాటు శివపూజలు, త్రిలోచన గౌరీ వ్రతం, స్కంధ షష్టి, సంకష్టహర గణపతి వ్రతం, శివసోమవార వ్రతాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేద వర్సిటీలోని ధ్యానారామంలో ప్రతిరోజూ ఉదయం 6 నుండి 6.45 గంటల వరకు రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమల నాదనీరాజన వేదికపై కార్తీక మాస విశిష్టతను తెలిపే ప్రవచనాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను భక్తులు విశేషంగా ఆదరిస్తూ సందేశాలు పంపుతున్నారని ఈవో వెల్లడించారు.
నవంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించారు.నవంబర్ నెలలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 8.47 లక్షలు మందిగా ఉన్నారు. హుండీ కానుకల ద్వారా రూ.61.29 కోట్లు ఆదాయం లభించింది. అలాగే తిరుమల శ్రీవారి ఇ-హుండీ కానుకల ద్వారా రూ.3.75 కోట్లు వచ్చింది. ఇక నవంబర్ నెలలో భక్తులకు విక్రయించిన లడ్డూలు 50.04 లక్షలు కాగా.. అన్నప్రసాద కేంద్రంలో ఆహారం స్వీకరించిన భక్తులు - 8.99 లక్షలు మందిగా ఉన్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు - 2.92 లక్షలు.