Vinukonda Murder Case: ఏపీలో లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తోంది, వినుకొండ వైసీప కార్యకర్త హత్యపై మండిపడిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..
బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య చేసిన సంగతి విదితమే.ఈ ఘటనపై వైసీపీ నేతలు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.
Vjy, July 18: బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య చేసిన సంగతి విదితమే.ఈ ఘటనపై వైసీపీ నేతలు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఘటనపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు . అలాగే, లా అండ్ ఆర్డర్ కాదు నారా లోకేశ్ ఆర్డర్ కనిపిస్తోందని మండిపడ్డారు. వినుకొండ రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఏపీ ప్రజలు కూటమికి అధికారం ఇచ్చింది సంక్షేమం చేయమని.. ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో 31 హత్యలు జరిగినట్టు తెలిపారు. అలాగే, 300 హత్యాయత్నాలు, 1050 దాడులు, దౌర్జన్యాలు జరిగాయని లెక్కలతో సహా వెల్లడించారు. హత్యకు గురైన రషీద్ కుటుంబానికి అండగా ఉండేందుకు రేపు వినుకొండకు వెళ్లనున్న వైఎస్ జగన్, ఏపీలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదని మండిపాటు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పచ్చ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాకా.. 31 మంది ప్రాణాలు బలిగొన్నారని, 35 మంది ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులనూ ద్వసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్విర్యమయ్యాయని అన్నారు గుడివాడ అమర్నాథ్. వినుకొండ సంఘటన దేశాన్ని కుదిపేసిందని, పార్టీకి చెందిన మైనార్టీ నేత చేతులు నరికి దారుణంగా హత్య చేశారన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ళ దాడి చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాన్ని తగులబెట్టారని తెలిపారు. ఎంపీపై రాళ్ళ దాడి ప్రజా స్వామ్యంలో ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వినుకొండలో దారుణం..అందరు చూస్తుండగానే రెండు చేతులు నరికి వైసీపీ నేత హత్య
ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, హత్యచారాలు, దాడులు, దౌర్జన్యం మీద శ్వేత పత్రం విడుదల చేయాలి. జరిగిన ప్రతి పరిణామానికి ప్రజలు బుద్ధి చెబుతారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని తెలిపారు.
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అలాగే, చంద్రబాబు కూటమి పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను భయపెట్టి లొంగదీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కాకాణి ఆరోపించారు.
ఏపీలో పక్కా ప్లాన్‌తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, పరిస్థితులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఏకంగా 31 హత్యలు జరిగాయి. సుమారు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ రాక్షసకాండకు భయపడి 2,750 కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఈ దారుణ పరిస్థితులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రులందరి సమిష్టి బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి.. అని కోరారు.
ఏపీలో హింస తారాస్థాయికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ కులోన్మాదులు నిత్యం దాడులు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవి జోక్ గా మారాయి’’ అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ రాజకీయ హింసలో భాగంగా వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం నేత రషీద్ హత్యకు గురయ్యాడు’’ అని ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని.. ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. వినుకొండలో ఒక యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు ప్రభుత్వమిది అంటూ దుయ్యబట్టారు.వినుకొండ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ‘‘మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు!’’ అంటూ ట్వీట్ చేశారు.