Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అవినాష్ రెడ్డి, నేడు సీబీఐ విచారణకు కడప ఎంపీ
ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను (anticipatory bail petition) చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది
Hyd, April 17: వివేకానంద రెడ్డి హత్య కేసులో (Vivekananda Reddy Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను (anticipatory bail petition) చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు బెంచ్ స్పష్టం చేసింది.
కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఇక నేడు ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే నేటి తెల్లవారుజామునే ఆయన భారీగా అనుచరులతో 10 కార్లలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు.ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ బెంచ్‌లో అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అది నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు అంటే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు అరగంట ముందు విచారణకు అనుమతించే అవకాశం ఉంది. హైకోర్టులో ఉన్న అన్నికేసుల వివరాలు తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉండగా.. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిందని లాయర్ చెబుతున్నారు.
కాగా.. నిన్న వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన సంగతి విదితమే. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో దర్యాప్తు సంస్థ ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించింది. భాస్కర్ రెడ్డిని విచారణకు పిలిచి రాత్రి ఏడు గంటల వరకూ విచారించిన మీదట సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 120బీ రెడ్‌విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భాస్కర్‌రెడ్డి సెల్‌ఫోన్ సీజ్ చేసి, ఆయన భార్య లక్ష్మికి మెమో అందించారు. దానిపై ఆయనతో సంతకాలు చేయించారు. పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న పి.జనార్దన్‌రెడ్డితో సాక్షి సంతకం పెట్టించారు.