COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,526 కోవిడ్ కేసులు, 24 మరణాలు నమోదు; నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు అమలు
రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు యధావిధిగా కర్ఫ్యూ అమలు కొనసాగుతుంది....
Amaravathi, July 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం, ఏపిలో కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగానే నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి కర్ఫ్యూ వేళల్లో మరిన్ని సడలింపులు కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపులు జూలై 15 నుండి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు లభించనుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు యధావిధిగా కర్ఫ్యూ అమలు కొనసాగుతుంది. కాగా, కర్ఫ్యూ సడలింపుల నేపథ్యంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు విస్మరించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది, మాస్కులు ధరించని వారికి రూ. 100 జరిమానా విధించబడుతుంది అంటూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 93,785 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 2,526 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19,32,105కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,29,210గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 404 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 391 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 24 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,081కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 2,933 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 18,93,498 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 25,526 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.