Raithu Padayatra: రైతుల పాదయాత్రకు మద్దతుగా వస్తే తొక్కేస్తా.. అయ్యన్నపాత్రుడిని హెచ్చరించిన నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్
అరసవల్లి సూర్యభగవానుడి దర్శనానికి కారులోనో, బస్సులోనో, రైల్లోనో వెళ్లాలని, అందులో ఎలాంటి తప్పు లేదని అన్నారు. కానీ పాదయాత్రగా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
Amaravati, September 25: అమరావతి రైతుల పాదయాత్రపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ తీవ్రంగా మండిపడ్డారు. అరసవల్లి సూర్యభగవానుడి దర్శనానికి కారులోనో, బస్సులోనో, రైల్లోనో వెళ్లాలని, అందులో ఎలాంటి తప్పు లేదని అన్నారు. కానీ పాదయాత్రగా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. గొడవలు సృష్టించి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. పనిలో పనిగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీరామారావు తెలుగువారి గుండెల్లో ఉన్న మాట నిజమే కానీ, ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు అయ్యన్నకు లేదన్నారు. రైతుల పాదయాత్రకు ఆయన అండగా వస్తే అక్కడే తొక్కేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు.
కాగా, రైతుల పాదయాత్ర నిన్న గుడివాడ చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రైతుల పాదయాత్ర సందర్భంగా 400 మందికిపైగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పాదయాత్ర నేడు గుడివాడ శివారు నాగవరప్పాడు నుంచి ఏలూరు జిల్లా కొన్నంకి వరకు కొనసాగుతుంది.