Vizag, September 24: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటైనర్ టెర్మినల్ ను దిగ్బంధించేందుకు మత్స్యకారులు యత్నించారు. హార్బర్ కు నౌకలు వచ్చే మార్గంలో బోట్లను నిలిపి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేటు వద్దకు కూడా మత్స్యకారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పోర్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయలేదని... హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పోర్టులో నిర్మాణంలో ఉన్న క్రూయిజ్ టెర్మినల్ లో స్థానిక మత్స్యకారులకు ఉద్యోగాలను కల్పించడంతో పాటు, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసనను చేపట్టారు.
1933లో ఓడరేవు నిర్మాణానికి తమ పూర్వీకులు భూమి ఇచ్చారని విశాఖ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ కు ఇచ్చిన వినతిపత్రంలో సంఘం నాయకులు గుర్తు చేశారు. గతంలో తమకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీంతో, అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.