KTR Slams Congress Govt Over Harassing Farmers(X)

Hyd, Feb 22:  నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి . కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్(KTR Slams Congress).

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్(KTR).. కోదండరెడ్డి గారు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి..చేతకానితనం వల్ల వచ్చిన కరువు..

అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం అని మండిపడ్డారు.

పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో(BRS) చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఏనాడూ భూగర్భజలాలు పడిపోలేదు కానీ కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి సమైక్యరాష్ట్రం నాటి దుస్థితి నెలకొందన్నారు. రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడిపోయాయనడం దారుణం అన్నారు.

 నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి... యాసంగి పంటలు వేసి అప్పులపాలు కావొద్దని రైతులకు విజ్ఞప్తి చేసిన కోదండ రెడ్డి 

కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం మరో విడ్డూరం అన్నారు. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం అన్నదాతలను వంచించడమే..ఎండుతున్న పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను మరిచి, మా వల్ల కాదని కాదు.. మీరే కాపాడుకోండని జారుకోవడం క్షమించరాని నేరం అన్నారు.

మీ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కరువు కాటకాలు రావడం సహజం అన్నట్టుగా మాట్లాడి, కాంగ్రెస్ సృష్టించిన ఈ సాగునీటి సంక్షోభం నుంచి తప్పించుకోలేరు..ఇప్పటికే వ్యవసాయరంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నారు.

కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక లక్షలాది మంది రైతులు అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పంటలకు సాగునీటి వసతి లేకపోవడంతో బోర్లు వేసినా చుక్కనీరు రాక మరింత ఆర్థికంగా చితికిపోతున్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న రాష్ట్ర రైతాంగంలో భరోసా నింపాల్సిన పాలకులే అస్త్రసన్యాసం చేసిన సందర్భం దేశ చరిత్రలోనే లేదు అన్నారు.

పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యం చేసినందుకు రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మత్తులను వెంటనే పూర్తిచేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని ఎప్పటికీ క్షమించరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.