Chandrababu naidu (Photo-X/TDP)

Vjy, Feb 19: ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలంటూ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేంద్ర వ్య‌వసాయ శాఖమంత్రి శివ‌రాజ్ సింగ్ కు రాసిన లేఖలో (Chandrababu Urges Centre to Support Chilli Farmers) ఆయన కోరారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరారు. మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ స్కీమ్ ద్వారా రైతుల నుంచి వెంట‌నే మిర్చి పంట‌ను కొనుగోలు చేయాల‌ని అన్నారు.

ఈ నెల 14న ఢిల్లీలో మిర్చి రైతుల ప‌రిస్థితి, ధ‌ర‌ల ప‌త‌నంపై జ‌రిగిన స‌మావేశం వివ‌రాల‌ను చంద్ర‌బాబు లేఖ‌లో పేర్కొన్నారు. వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌ల‌ను కూడా స‌మ‌ర్పించిన‌ట్లు సీఎం గుర్తు చేశారు. గత ప‌దేళ్ల‌లో మిర్చి ఉత్ప‌త్తి, ధ‌ర‌ల వివ‌రాల‌ను కూడా లేఖ‌లో తెలిపారు. ఈ మ‌ధ్య మిర్చి ధ‌ర‌లు బాగా ప‌డిపోయాయ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. సాధార‌ణ మిర్చి క్వింటాల్ కు రూ. 11 వేలు, ప్ర‌త్యేక వెరైటీ మిర్చి క్వింటాలు రూ. 13 వేల‌కు ప‌డిపోయింద‌న్నారు.

ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు

ఆ ధ‌ర గ‌తంలో రూ. 20 వేలుగా ఉండేద‌న్నారు. విదేశాల‌కు మిర్చి ఎగుమ‌తి త‌గ్గిపోవ‌డం కూడా ఈ ప‌రిస్థితికి ఒక కార‌ణమ‌ని అన్నారు. మిర్చి ధ‌ర‌లు బాగా త‌గ్గిపోవ‌డంతో రైతులకు ఆర్థిక కష్టాలు త‌ప్ప‌డం లేద‌న్నారు. రైతులు అమ్ముకునే ధ‌ర‌కు, సాగు వ్య‌యానికి మ‌ధ్య పొంత‌న ఉండ‌టం లేద‌న్నారు. 50 శాతం నిష్ప‌త్తిలో కాకుండా 100 శాతం న‌ష్టాన్ని కేంద్రం భ‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మార్కెట్ జోక్యం ద్వారా త‌గ్గిన ధ‌ర‌ను భ‌ర్తీ చేసేలా చూడాల‌ని కోరారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. గడిచిన 10 ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి, ధరలపై వివరాలను సీఎం సమర్పించారు.