YS Jagan Mohan Reddy (Photo/YSRCP)

Guntur, Feb 19: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని జగన్  (YSRCP Chief Jagan Mohan Reddy) అన్నారు.

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయనఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని (YS Jagan Slams Chandrabbau Govt) మండిపడ్డారు.

వీడియో ఇదిగో, గుంటూరు మిర్చి యార్డు రైతులతో మాట్లాడిన జగన్, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక

మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది.

మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించినపంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్‌ఫ్లస్‌ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్‌ క్లియర్‌ చేయలేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు.దీనిపై జగన్ మీడియా వేదికగా చంద్రబాబును ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు.  ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు?. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.