Rythu Bharosa Funds Release: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం నిధులను విడుదల చేసిన జగన్ సర్కార్, రైతుల బీమా పథకం కోసం అదనపు నిధులు సైతం విడుదల
3,928.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం తెలిపారు....
Amaravathi, May 13: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'వైయస్ఆర్ రైతు భరోసా పథకం యొక్క మొదటి విడత నిధులను విడుదల చేసింది. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కంప్యూటర్ లో ఒక క్లిక్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ రైతులకు ఎలాంటి కష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతో పెట్టుబడి సాయం అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 52.38 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా వైఎస్‌ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద వరుసగా మూడో ఏడాది పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామన్నారు. మొదటి విడత కింద రూ. 3,928.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం తెలిపారు.
ఏపిలో ఈ ఏడాదికి గానూ మొత్తంగా 52,38,517 రైతులు 'రైతు భరోసా' పథకానికి అర్హులు కాగా, ఇందులో 1,86,254 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మరియు అటవీ సాగుదారులు కూడా ఉన్నారు. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వ పథకమైన వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద రూ. 2,918.43 కోట్లు మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద అందజేసిన రూ 1,010.45 కోట్లు కలిపి మొత్తం రూ. 3928.88 కోట్లు నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
Here's the update:
అలాగే, వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్ -2020 సీజన్‌కు అర్హులైన రైతులకు బీమా ప్రీమియం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం మరో రూ.2,586.60 కోట్లను అదనంగా విడుదల చేసింది. వ్యవసాయ చీఫ్ స్పెషల్ సెక్రటరీ పూనం మలకొండయ్య బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని ఈ నెల 25 న రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఆధార్ లింక్ చేసిన రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అర్హులైన రైతుల జాబితాలను సిద్ధం చేసి, పంపిణీకి ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ కమిషనర్‌ను ఆదేశించారు.