YS Viveka Murder Case: అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు, తల్లి కోసం హైదరాబాద్ నుంచి పులివెందులకు కడప ఎంపీ, సీబీఐ విచారణకు హాజరు కాలేనని వెల్లడి
ఈ ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక పులివెందుల ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.తల్లి లక్ష్మమ్మ అస్వస్థత విషయం తెలిసిన అవినాష్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వెనక్కు మళ్లారు.
Kadapa May 19: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక పులివెందుల ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.తల్లి లక్ష్మమ్మ అస్వస్థత విషయం తెలిసిన అవినాష్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వెనక్కు మళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం సిబిఐ ముందు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే ఇప్పటికే తండ్రి భాస్కర్ రెడ్డి జైలులో ఉండడంతో తల్లిని చూసుకునేందుకు అవినాష్ రెడ్డి పులివెందుల వెళ్లారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లిన అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు.. ఉదయం చోటుచేసుకున్న పరిణామాలను లిఖిత పూర్వకంగా అధికారులకు అందించారు. తన తల్లికి అస్వస్థత విషయం తెలిసి అవినాష్ హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లారని, చివరి నిమిషంలో విషయం తెలియడంతో సీబీఐ విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు తెలిపారు.
పులివెందుల ఆస్పత్రిలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నట్లు న్యాయవాది మల్లారెడ్డి తెలిపారు. తన తండ్రి జైల్లో ఉండటంతో తల్లిని అవినాష్ రెడ్డే చూసుకోవాలన్నారు. సీబీఐకి ఈ విషయంపై సమాచారం ఇచ్చామని, విచారణకు మరో తేదీ ఇవ్వాలని కోరామని న్యాయవాది మల్లారెడ్డి వెల్లడించారు.
ఈనెల 16న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ హైదరాబాద్ నుంచి కడప వెళ్లిపోయారు. దీంతో సీబీఐ బృందం కూడా అంతేవేగంగా కడప చేరుకోవడం.. అవినాష్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19న(నేడు) విచారణకు రావాలంటూ డ్రైవర్‌కు నోటీస్ ఇవ్వడం ఉత్కంఠ రేపింది. తాజాగా విచారణ కోసం పులివెందుల నుంచి హైదరాబాద్ చేరుకున్న అవినాష్.. మళ్లీ చివరి నిమిషంలో సీబీఐకి లేఖ రాస్తూ తన తల్లి అనారోగ్య కారణాల రీత్యా విచారణకు రాలేనని పేర్కొన్నారు. అనంతరం తిరిగి ఆయన పులివెందులకు బయల్దేరారు.