TDP vs YSRCP: పట్టాబి వ్యాఖ్యలు దారుణం, దీనిపై దర్యాప్తు చేస్తామని తెలిపిన డీజీపీ సవాంగ్, నారా లోకేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు, చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మంత్రులు
పట్టాభి నిన్న దారుణమైన భాష మాట్లాడారని డీజీపీ అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదని అన్నారు.
Amaravati, Oct 20: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి నిన్న మీడియా సమావేశంలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వైసీపీ-టీడీపీ (YCP vs TDP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఈ రోజు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. ఇక వైసీపీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ టీడీపీ పార్టీ దాని అధినేతలపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై డీజీపీ గౌతం సవాంగ్ (AP DGP Sawang) స్పందించారు. పట్టాభి నిన్న దారుణమైన భాష మాట్లాడారని డీజీపీ అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదని అన్నారు.పార్టీ కార్యాలయంలో కూర్చొని ఇలాంటి భాషను మాట్లాడటం సరికాదని అన్నారు. ఇలాంటి భాషను ఎవరూ అంగీకరించరని చెప్పారు. పట్టాభి వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. గత కొన్నిరోజులుగా ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని చెప్పారు.
ప్రజలు ఆవేశాలకు గురికావొద్దు, రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీజీపీ సవాంగ్
చంద్రబాబు తనకు కాల్ చేశారనే విషయం గురించి మాట్లాడుతూ... నిన్న సాయంత్రం తనకు ఒక కాల్ వచ్చిందని... అయితే ఎవరు మాట్లాడుతున్నారో తనకు స్పష్టత లేదని తెలిపారు. గుజరాత్ లో దొరికిన డ్రగ్స్ కు, ఏపీకి సంబంధం లేదని గతంలోనే స్పష్టం చేశామని డీజీపీ తెలిపారు. అక్కడి నుంచి ఒక్క గ్రాము కూడా ఏపీకి రాలేదని విజయవాడ సీపీ చెప్పారని గుర్తు చేశారు. డగ్స్ పై ఇన్నిసార్లు స్పష్టంగా చెప్పినా... పదేపదే ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ1గా, అశోక్ బాబును ఏ2గా, ఆలపాటి రాజాను ఏ3గా, తెనాలి శ్రవణ్ ను ఏ4గా, పోతినేని శ్రీనివాసరావును ఏ5గా పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. వీరందరిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత అక్కడకు సీఐ నాయక్ వచ్చారని... ఈ సందర్భంగా నారా లోకేశ్ సహా పలువురు దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసులు నమోదు చేశామని చెప్పారు.
మంత్రి కొడాలి నాని: ప్లాన్ ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామని హెచ్చరించారు. పట్టాభి కూడా డబ్బులు తీసుకొని తిడుతున్నాడన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొట్టారని మండిపడ్డారు. చంద్రబాబువి మొదటి నుంచి మోసపూరిత రాజకీయాలే అని దుయ్యబట్టారు. చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎం వైఎస్ జగన్‌ను ఇంచు కూడా చంద్రబాబు కదపలేరని స్పష్టం చేశారు.
చంద్రబాబులా పెయిడ్ ఆర్టిస్ట్‌లను పెట్టి తిట్టించడం తమకు రాదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమిత్‌షాపై తిరుపతిలో చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని, చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అమిత్‌షా, మోదీలకు ఎప్పుడో తెలుసన్నారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అమిత్‌షాను కలుస్తావని ప్రశ్నించారు. చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనని, ఆయన చేసే కొంగ జపాలను ఎవరూ నమ్మరని అన్నారు.
‘ఏపీలో ఏదో జరిగిపోతోంది. శాంతిభద్రతలు లేవు. దేశానికి మాదకద్రవ్యాలను సీఎం జగన్ సప్లై చేస్తున్నాడనే ప్రచారం కోసం టీడీపీ ప్రయత్నం చేసింది. టీడీపీ నాయకులు గత 10 రోజుల నుంచి తాడేపల్లి నుంచి గంజాయి వైఎస్ జగన్ ప్రపంచానికి సరఫరా చేస్తున్నాడంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు. రాజశేఖర్ రెడ్డిని ముఠా నాయకుడని, అవినీతిపరుడని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ నూనూగు మీసాల వయసు నుంచి ఆయనపై కుట్రలు చేయడం ప్రారంభించారు. ఈ రోజు అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్నీ చేసినా ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేవు.
పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు ఇరగ్గానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటాడు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి . యుద్ధంలో మగాళ్లతో ఫైట్ చేస్తాం. లోకేష్ లాంటి అటూ ఇటూ కానీ వాళ్ళతో ఏమి యుద్ధం చేస్తాం. లోకేష్ విసిరిన ఛాలెంజ్‌కు మేము స్పందించలేము. వైఎస్ పెట్టిన అభ్యర్థిపై చిత్తుగా ఓడిపోయిన వాడితో మాకేంటి పోటీ. జీవితంలో ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత లోకేష్ ఛాలెంజ్ చేయాలి.’ అని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు.
అనిల్ కుమార్ యాదవ్ : పట్టాభి వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ నేత నారా లోకేశ్ కు సవాల్ విసిరారు. 'దమ్ముంటే చూసుకుందాం రా' అంటూ ఛాలెంజ్ చేశారు. సీఎం జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా? అని అనిల్ మండిపడ్డారు. తాము చేతికి గాజులు తొడుక్కోలేదని అన్నారు. మీరు చిత్తూరు జిల్లాలోనే పుట్టుంటే... రా చూసుకుందామని అన్నారు.
తాను వారం రోజులు నెల్లూరులోనే ఉంటానని... ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. ఎవరొచ్చినా సరేనని... కాన్వాయ్ ని కూడా పక్కన పెట్టి వస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ ను దారుణంగా తిట్టిన విషయం జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అయితే మీరు ఉండగలరా? అని అడిగారు. వైసీపీ కార్యకర్తలను ఎవరు తాకినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
టీడీపీ నేతలు మాట్లాడుతోన్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి భాష సరికాదని చెప్పుకొచ్చారు. అటువంటి భాషను సమర్థించేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం నుంచి బలగాలను పంపాలని కోరడం ఏంటని వ్యాఖ్యానించారు. ఓ వైపు బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తున్నానంటూ.. మరోవైపు చంద్రబాబు పార్టనర్ గా పవన్ కల్యాణ్ టీడీపీ నేతల వ్యాఖ్యలను సమర్థిస్తుండడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
టీడీపీ నేత పట్టాభిరామ్ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడి సమాధానం ఏంటని ఆయన నిలదీశారు. సోము వీర్రాజు కూడా చంద్రబాబు నాయుడిని సమర్థిస్తూ మాట్లాడడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని ఆయన అన్నారు. టీడీపీ చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే ఆ పార్టీ నేతలు అభ్యంతరకర రీతిలో ప్రవర్తిస్తున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. జగన్‌పై కుట్రలో భాగంగా పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారని ఆయన విమర్శించారు. అసలు చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా ఏపీకి ఎందుకు వచ్చారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు అర్థమేమిటో తెలుసా? అని ఆయన నిలదీశారు. చంద్రబాబు గురించి ఎవరిని అడిగినా ఆయన వెన్నుపోటు పొడిచారని, కుట్రదారుడని చెబుతారని వ్యాఖ్యానించారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో సీఎం జగన్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందించారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జగన్ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తారని, పబ్లిసిటీ కోసం దేనికైనా తెగిస్తారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. జగన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పట్టాభి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.
టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను, మాట్లాడిన భాషను చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీని పాలేరు అంటూ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలోనూ డీజీపీ పనిచేశారని, ఒక ఐపీఎస్ అధికారిని ఇలా మాట్లాడటం హేయమన్నారు. ప్రజల సింపతి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ పార్టీ పని అయిపోయిందని, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కొంగ జపాలు చేసిన ప్రజలు నమ్మరని అన్నారు. గతంలో ఎన్ని కుట్రలు, హత్యలు చేయించారో ప్రజలకు తెలుసన్నారు. పట్టాభి మాట్లాడింది తప్పు అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడితే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ, ముఖ్యమంత్రిని తిట్టడం తప్పని చెప్పి నిరాహార దీక్షకు కూర్చోవాలన్నారు. పట్టాభి వ్యాఖ్యలపై చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
చంద్రబాబు ఛాలెంజ్ హాస్యాస్పదమని.. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టాభి వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన మంచి మనసు సీఎం జగన్‌ది. చంద్రబాబును సొంత పార్టీ నేతలే నమ్మడంలేదు. టీడీపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
సీఎం జగన్ ఎంతో సంయమనం పాటిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత పట్టాభి దుర్భాషలాడింది అందరూ గమనించారని చెప్పారు. అది ప్రస్తావించాలన్నా చాలా ఇబ్బంది కరంగా ఉందని, టీడీపీ నేతలు నిస్పృహలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ అధికార ప్రతినిధి నోరు జారి మాట్లాడినట్టుగా కూడా లేదని, ఈ మాట వాడినప్పుడు రియాక్షన్ ఉంటుందని పట్టాభి గ్రహించాలన్నారు. బోసిడీకే అన్న మాట పదేపదే అనడం వెనుక ఉద్దేశం ఏంటి? అని సజ్జల ప్రశ్నించారు. ఆ పదం మాట్లాడటం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఇంత ఘోరమైన మాట మాట్లాడాక అభిమానం ఉన్న వారెవరూ ఊరికే ఉండరని హెచ్చరించారు. పట్టాభి కావాలనే సీఎంపై ఆ వ్యాఖ్యలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ సీఎం జగన్‌ను దూషిస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారని చంద్రబాబు అంటున్నారని, అదే అమిత్‌షా కాన్వాయ్‌పై దాడి చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.