AP Covid Update: అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా, ఏపీలో తాజాగా 630 మందికి కోవిడ్ పాజిటివ్, 8,71,305కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, ప్రస్తుతం 6,166 యాక్టివ్ కేసులు
గత జులైలో తనకు కొవిడ్ (Second Time Positive) సోకిందని, కొన్నిరోజులకే కోలుకున్నానని అంబటి వెల్లడించారు.
Amaravati. Dec 5: ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 630 కరోనా కేసులు (AP Covid Update) నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 97, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 5 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,71,305కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 7,024 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 882 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) రెండోసారి కరోనావైరస్ సోకింది. గత జులైలో తనకు కొవిడ్ (Second Time Positive) సోకిందని, కొన్నిరోజులకే కోలుకున్నానని అంబటి వెల్లడించారు. అయితే నిన్న మరోసారి అసెంబ్లీలో కరోనా టెస్టు చేయించగా, పాజిటివ్ అని వెల్లడైందని తెలిపారు. రీఇన్ఫెక్షన్ కు గురికావడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరతానని, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్ ను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు.
Here's YCP MLA Tweet
ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం వైసీపీకి చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నిన్న ఆయన అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలతో, మంత్రులతో సన్నిహితంగా మెలిగారు. అనంతరం వారికి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చీరలు కూడా పంచారు. స్వయంగా ఆయన నుంచి చీరలు అందుకున్న సదరు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇప్పుడు కరోనా భయాలు మొదలయ్యాయి. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు కూడా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్దమవుతున్నారు.