YSRCP MP Vijayasai Reddy: కేంద్రంలో విజయసాయి రెడ్డికి కీలక పదవి, పీఏసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ ఎంపీ, అధికారిక ప్రకటనలో తెలిపిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ, ఏపీకి 10 బ్యాంకులు ఇచ్చిన రుణాల వివరాలు ఇవే..
రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఓ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా పీఏసీలో సభ్యుడిగా కొనసాగుతారు.
Amaravati, August 10: కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుడిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఓ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా పీఏసీలో సభ్యుడిగా కొనసాగుతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రధాన విధి కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను, ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడం. కాగా, తాజా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటుపై రాజ్యసభ ప్రధాన కార్యదర్శి దేశ్ దీపక్ శర్మ పార్లమెంటు బులెటిన్ ద్వారా వెల్లడించారు. విజయసాయి, సుధాంశు త్రివేది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులు తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు ఆదేశించడాన్ని విజయసాయి హైకోర్టులో సవాల్ చేశారు. మొదట సీబీఐ కేసులు విచారణ జరపాలని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు రెండింటిని సమాంతరంగా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని విజయసాయి హైకోర్టును కోరారు. అయితే, హైకోర్టు విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చింది. ఈడీ కేసులే మొదట విచారించాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. అటు, జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది.
ఏపీకి 10 బ్యాంకులు ఇచ్చిన రుణాల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు 10 ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ) నుంచి తీసుకున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు ఇచ్చిన రుణాలపై వివరణ ఇచ్చింది. ‘‘10 పీఎస్‌బీలు రూ.56,076 కోట్ల రుణాలిచ్చాయి. అత్యధికంగా ఎస్‌బీఐ రూ.15,047 కోట్ల రుణాలు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.9,450 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7,075 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.5,797 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 4,300 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.2,800 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.2,307 కోట్లు, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ రూ.750 కోట్ల రుణాలు ఇచ్చాయి’’ అని తెలిపింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.