Amaravati, August 10: కరోనావైరస్ కష్టకాలంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది 'వైఎస్సార్ నేతన్న నేస్తం' (YSR Nethanna Nestham Scheme) అమలు చేసింది. ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను (YSR nethanna nestham funds) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని, 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. ‘‘వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నాం.
మూడో విడత కింద రూ.192.08 కోట్లు జమ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలకు ఆర్ధిక సాయం అందిస్తున్నాం. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున సాయం చేస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నాం. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆప్కో ద్వారా ఈ-మార్కెటింగ్ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.
మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చిన రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది.