Krishna Water Row: మరుగుతున్న కృష్ణా నీరు, నదీ జలాల వాడకంపై ఇరు రాష్ట్రాల మంత్రులు పోటాపోటీ విమర్శలు; రాయలసీమ పథకంపై ఏపి సీఎస్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్ట్రాంగ్ వార్నింగ్
Hyderabad, June 25: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌జిటి ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని కఠినంగా హెచ్చరించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఏపి ప్రభుత్వం ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ పనులు చేపడుతుందని ఆరోపిస్తూ తెలంగాణకు చెందిన గవినోల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్‌జిటిలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసును శుక్రవారం విచారించిన చెన్నై ట్రిబ్యునల్, ఏపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు తాజా పరిస్థితులపై నివేదించాలని చెన్నైలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని కృష్ణ రివర్ బోర్డు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూలై 12 వరకు వాయిదా వేసింది.
కృష్ణా నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఏపి చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకింది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సర్వే పేరు చెప్పి దొంగతనంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు, ఏపి ప్రాజెక్టుల నిర్మాణం అక్రమం అంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెలంగాణను ఎడారి చేసేలా ఏపి ప్రాజెక్టులు ఉన్నాయని మరో మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏపితో మంచిగా ఉండాలనుకున్నా ఆ రాష్ట్ర సీఎం జగన్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఇంకో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇదే క్రమంలో అప్పటి వైఎస్ పాలనపై కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తమ ముఖ్యమంత్రి జగన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. రాజకీయాల కోసమే తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఏపి మంత్రి పేర్ని నాని విమర్శించారు. కృష్ణా నుంచి గ్లాసు నీరు కూడా అదనంగా తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.