Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కృతం, స్పిల్ వే మీదుగా గోదావరి నీరు డెల్టాకు విడుదల, ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలో ఉండగానే అందిన తొలి ఫలితం

ప్రాజెక్టు నుంచి డెల్టాకు స్పిల్ వే మీదుగా ఈరోజు గోదావరి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా గోదావరిలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో స్పిల్‌వే మీదుగా నీటిని మళ్లించారు...

Polavaram Project- Approach Channel | Photo: twitter video grab

Polavaram, June 11: పోలవరం ప్రాజెక్ట్‌లో నేడు తొలి ఫలితానికి అంకురార్పణ జరిగింది. ప్రాజెక్టు నుంచి డెల్టాకు స్పిల్ వే మీదుగా ఈరోజు గోదావరి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా గోదావరిలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో స్పిల్‌వే మీదుగా నీటిని మళ్లించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని వర్చువల్‌గా పాల్గొన్నారు. గోదావరిలో అప్రోచ్‌ కెనాల్‌కు నీరు విడుదల చేయడంతో స్పిల్‌వే, రివర్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి.. అక్కడి నుంచి సెంట్రల్‌ డెల్టా, తూర్పు, పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాకు చేరనుంది. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి సాగునీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు.

పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏపి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే తో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ నేడు తొలి ఫలితం దక్కింది. గోదావరి డెల్టాకు మొదటిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్రక్రియ నేడు (శుక్రవారం 11.06.2021) ప్రారంభించడం ద్వారా తొలి ఫలితం అందించేందుకు అంకురార్పణ చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించడానికి అవసరమైన పనులను రికార్డ్ సమయంలో మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్ వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్ ఛానెల్ ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దాంతో పెద్ద నది రూపుదిద్దుకుంది.

పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని మళ్లించి అప్రోచ్ కెనాల్ కు విడుదల చేయడం వల్ల ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సశ్యశ్యామలం చేయనుంది. ఇక నుంచి ఏడాది పోడవునా నీటిని అప్రోచ్ ఛానెల్ ద్వారా మళ్లించి మళ్లీ పైలెట్ ఛానెల్ ద్వారా గోదావరిలోకి కలుపుతారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానెల్ ద్వారానే విడుదల కానుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే నీరు గోదావరి డెల్టాకు చేరుతుండడం వల్ల పోలవరం తొలి ఫలితం అందుతున్నట్లయ్యింది.