COVID in TS: యూకే నుంచి తెలంగాణ వచ్చిన వారిలో 7గురికి కరోనా, అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి ఈటల, రాష్ట్రంలో కొత్తగా మరో 518 పాజిటివ్ కేసులు నమోదు
సెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యూకె నుండి మరియు యూకే మీదుగా తెలంగాణకు 1200 మంది వచ్చారని, అందులో ఇప్పటికే 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా 7 గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంత్రి వెల్లడించారు....
Hyderabad, December 25: కొత్త రకం కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యూకె నుండి మరియు యూకే మీదుగా తెలంగాణకు 1200 మంది వచ్చారని, అందులో ఇప్పటికే 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా 7 గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. వీరిలో ఏ రకం వైరస్ ఉందో తెలుసుకోవడానికి వారి శాంపుల్స్ ను CCMB ల్యాబ్ కి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.
కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని వైద్య నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలు ఇంటికే పరిమితం అయి జరుపుకోవాలని ఆయన సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 44,869 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 518 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 691 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 66,55,987 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 284,074కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 91 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 41, మేడ్చల్ నుంచి 39, వరంగల్ అర్బన్ నుంచి 35 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,527కు పెరిగింది.
అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 491 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 275,708 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,839 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.