Honour Killing: ‘బాబూ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇంటికి రా..’, ‘డబ్బులు లేవండి’, ‘పర్లేదు.. చార్జీలకు రూ.200 గూగుల్ పే చేశాం.. రా’, యువకుడిని ఇంటికి రప్పించి మరీ హత్య.. అనంతరం మృతదేహం నాలాలోకి.. హైదరాబాద్ లో గగుర్పొడుస్తున్న పరువు హత్య..
కులాలు వేరన్న కారణంతో తన కూతురిని ప్రేమించిన యువకుడిని ఇంటికి రప్పించి మరీ హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని నాలాలోకి విసిరేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.
Hyderabad, October 14: ‘బాబూ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇంటికి రా..’ అని ఆప్యాయంగా పిలిచారు.. ‘డబ్బులు లేవండి’ అని ఆ యువకుడు చెప్పినప్పటికీ.. ‘పర్లేదు.. చార్జీలకు రూ.200 గూగుల్ పే చేశాం.. రా’ అని ప్రేమగా ఆహ్వానించారు. ఈ మాటలు నమ్మి ప్రేయసి తల్లిదండ్రుల (Lover parents) ఇంటికి వెళ్ళాడు ఆ యువకుడు. అయితే, తాను అడుగు పెట్టిన ఇల్లు.. తనకు యమపురిగా మారుతుందని అతను గ్రహించలేకపోయాడు. కులాలు (Cast) వేరన్న కారణంతో తన కూతురిని ప్రేమించిన యువకుడిని ఇంటికి రప్పించి మరీ హత్య (Murder) చేసి, అనంతరం మృతదేహాన్ని నాలాలోకి (Nala) విసిరేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూలు జిల్లా కోడేరుకు చెందిన బాలస్వామి ఉపాధి కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చి పటాన్ చెరులో ఉంటున్నాడు. ఆయన కుమారుడు శివకుమార్ (18) కూలి పనులు చేస్తాడు. ఈ క్రమంలో ముషీరాబాద్‌కు చెందిన యువతితో శివకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో వారు శివను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 7న యువతితో శివకు ఫోన్ చేయించారు. చూడాలని ఉందని, ఒకసారి రావాలని ఆమె కోరింది. యువతి కుటుంబ సభ్యులు కూడా శివకు పదేపదే ఫోన్ చేసి మాట్లాడాలని ఉందని, పెళ్లి విషయం మాట్లాడుకుందాం ఒకసారి వచ్చి వెళ్లాలని కోరారు. అయితే, చార్జీలకు తన వద్ద డబ్బులు లేవని అతడు చెప్పడంతో యువతి ఫోన్ నుంచి రూ. 200 గూగుల్ పే చేశారు. దీంతో డబ్బులు డ్రా చేసుకున్న శివ అదే రోజు సాయంత్రం ముషీరాబాద్ వెళ్లాడు.
అలా వెళ్లినవాడు రాత్రయినా రాకపోవడంతో ఆందోళన చెందిన శివ తల్లి కుమారుడికి ఫోన్ చేసింది. తాను ముషీరాబాద్‌లోని యువతి వద్దకు వచ్చానని చెబుతుండగానే ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా అతడి నుంచి ఫోన్ లాక్కుని స్విచ్ఛాప్ చేశారు. ఆ రోజు రాత్రి అతడు ఇంటికి చేరుకోలేదు. దీంతో మరుసటి రోజు శివ తల్లిదండ్రులు ముషీరాబాద్ వచ్చి యువతి తల్లిదండ్రులను కలిశారు. తమ కుమారుడి ఆచూకీ చెప్పాలని కోరారు. అయితే, శివ తమ వద్దకు రాలేదని వారు చెప్పడంతో శివ తల్లిదండ్రులు పటాన్‌చెరు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని అదుపులోకి విచారించారు. శివ తమ ఇంటికి వచ్చిన రోజే హత్య చేసి ముషీరాబాద్ సమీపంలోని నాలాలో పడేసినట్టు చెప్పారు. తమవి వేర్వేరు కులాలు కావడంతోనే శివను హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు. శివకుమార్ మృతదేహం కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.