PM Modi Nizamabad Tour: నా కళ్లలోకి చూడటానికి కేసీఆర్ భయపడుతున్నాడు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, నిజామాబాద్‌లో ప్రధాని స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hyd, Oct 3: మూడు రోజుల వ్యవధిలో ప్రధాని రెండోసారి తెలంగాణలో పర్యటించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందూరులోని గిరిరాజ్ కళాశాల మైదనంలో ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచే.. రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్ - సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రారంభించారు.
ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తొలి యూనిట్‌ను ప్రారంభించుకున్నట్లు చెప్పిన మోదీ.. త్వరలోనే రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు రూ.4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మిస్తున్నట్లు మోదీ చెప్పారు.
20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మనోహరాబాద్-సిద్దిపేట మధ్య నిర్మించిన 76 కి.మీ రైలు మార్గాన్ని మన్మాడ్-ముద్కేడ్-మహబూబ్‌నగర్- డోన్ మధ్య చేపట్టిన రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును సిద్దిపేట-సికింద్రాబాద్ మార్గంలో రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.
నిజామాబాద్ ఇందూరు వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన మహిళలకు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ మహిళలు నాకు అండగా ఉండబట్టే నేను మహిళా బిల్లును పార్లమెంటులో పాస్ చేయగలిగానని, విపక్ష ఇండియా కూటమి పైకి మద్దతిస్తున్నట్టు నటించినా లోలోపల కుట్రలు పన్నాయి. చివరకు వారంతా గత్యంతరం లేకే మహిళా బిల్లుకు మద్దతిచ్చాయన్నారు.
ఎన్డీఏ(NDA)లో చేరతానని సీఎం కేసీఆర్(CM KCR) వెంటపడ్డారు.. కానీ ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తెలంగాణలోని నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘GHMC ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి కలిశారు. తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని కేసీఆర్ చెప్పారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు.
ఈరోజు తెలంగాణలో రూ. 8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించాను. వీటిలో ఎన్టీపీసీ వలన తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇందులో విశేషమేమిటంటే నేను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును నేనే ప్రారంభించానని అన్నారు. అన్నిటినీ మించి కరోనా కష్టకాలంలో తెలంగాణ దేశానికే వ్యాక్సిన్ ఇచ్చింది. తెలంగాణాలో ప్రతిభకు కొదవేలేదు. మీ ఉత్సాహం చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతోందన్నారు.
ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యమని కేసీఆర్‌తో చెప్పా. మీరేమైనా రాజులా అని నేను ప్రశ్నించా. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పా. బీఆర్ఎస్(BRS)తో పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్‌కు తేల్చి చెప్పా. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నాడు’’ అని మోదీ హెచ్చరించారు.
కేసీఆర్ గతంలో హైదరాబాద్(Hyderabad) ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నాడు. ఆర్భాటంగా స్వాగతం పలికాడని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ(Telangana) సాకారమైంది. తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడింది.
కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగింది. కేసీఆర్, ఆయన కుమారుడు... ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్ఎస్(BRS) దోచుకుంటోంది. కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదు. నమ్మకం ఉంచి టి.బీజేపీకి అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్(BRS) దోచుకున్నదంతా కక్కిస్తా’’ అని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉంది. కరోనాకు మందు కనిపెట్టారని మోదీ చెప్పారు. ‘‘నిజాం నవాబులు హైదరాబాద్‌ను వదలకపోతే ఒకే ఒక్క గుజరాతీ బిడ్డ వల్లబాభాయ్ పటేల్ వారిని తరిమేశారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన అవసరం లేదు. వేలాది మంది బలిదానం చేసి సాధించిన రాష్ట్రాన్ని ఒకే కుటుంబం కబ్జా చేసింది. ఇక్కడి ప్రజల కలలను తుంచేశారు. కాంగ్రెస్ వారితో కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌తో సంబంధం ఉంది.
వాళ్లిద్దరు తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS)కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయి. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణకే వినియోగిస్తున్నారు. రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశాం. నిజామాబాద్ మహిళలు, రైతులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన అపురూప స్వాగతంతో ధన్యుడిని. ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలి. మీ ఓట్ల బలంతో వాళ్లు బలవంతులు అయ్యారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మందిరాలపై ప్రభుత్వ పెత్తనం సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘మందిరాల స్థలాలు కబ్జా చేస్తున్నారు.. ఆస్తులు లాక్కుంటున్నారు.కానీ, మైనార్టీ ప్రార్థన మందిరాలపై ఇలాంటి చర్యలు తీసుకోగలరా..? హిందు మందిరాలను నడిపించే హక్కు హిందువులకే ఇవ్వగలరా..?పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశ ప్రగతిని ఎవరూ ఆపలేరు. ఇదే నా లక్ష్యం.
తెలంగాణలో మరో ఐదేళ్లు దోపిడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు. మా వాళ్లను గెలిపించండి.. మీ పాదాల దగ్గర ఉంచుతా. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తాం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)