DAV School Horror: డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేయండి.. మంత్రి సబిత ఆదేశం.. ఇప్పటివరకూ ఈ భయానక ఘటనలో తీసుకున్న చర్యలు.. పరిణామక్రమం ఏమిటంటే??
ఎల్‌కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్‌లోని బీఎస్‌డీ డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ విద్యాశాఖ అధికారిని మంత్రి సబితా ఆదేశించారు.
Hyderabad, October 22: బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita indrareddy) స్పందించారు. ఎల్‌కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బీఎస్‌డీ డీఏవీ పాఠశాల (BSD DAV School) గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ విద్యాశాఖ అధికారిని మంత్రి సబితా (telangana minister) ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని మంత్రి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఈ కమిటీలో పాఠశాల విద్యా శాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని అన్నారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీ పత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Telangana Education Minister) పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్ కేజి చదివే విద్యార్థినిపై ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ రజినీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. రెండు నెలలుగా బాలిక ప్రవర్తనలో మార్పును గమనించినట్లు వారు చెప్పారు. అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో చిన్నారి ఉందని, మంగళవారం చిన్నారి నీరసంగా ఉండి ఏడవడంతో అసలు విషయం బయటపడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ప్రిన్సిపాల్ మాధవి గది పక్కనున్న డిజిటల్ రూమ్ లోనే ఇదంతా జరుగుతున్నా ఆమె నిరోధించలేదని ఆరోపించారు. డ్రైవర్ రజినికుమార్, ప్రిన్సిపాల్ మాధవిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు.