Fish 'Prasadam' Distribution: రేపు ఉదయం 7 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, రెండు రోజుల పాటు ప్రసాదం పంపిణీ
జూన్ 9వ తేదీ ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తారు.
Hyd, June 8: మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు 9వ తేదీన చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 9వ తేదీ ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకుల కోసం 9, 10వ తేదీలు (రెండు రోజులు) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
చేప ప్రసాదం పంపిణీకి ఆర్ అండ్ బీ అధికారులు షెడ్స్, ఫ్లడ్ లైట్లు, భారీకేడ్లు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు శానిటేషన్, మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, జలమండలి అధికారులు మంచినీటిని అందుబాటులో ఉంచడం, సమాచార శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. మృగశిర కార్తి సందర్భంగా అస్తమ వ్యాధిగ్రస్తుల కోసం చేపమందు పంపిణీ చేస్తుంటారు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్, పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీని బట్టి, ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేతలు చేపడుతామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అదనపు సీపీ సూచించారు.
అవసరాలను బట్టి ట్రాఫిక్ మళ్లింపులు
ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వాహనాలను, అబిడ్స్ జీపీఓ- నాంపల్లి స్టేషన్ రోడ్డులోకి మళ్లిస్తారు.
ఎంజే బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలస్క టవర్స్ వద్ద దారుసలాం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు.
పీసీఆర్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్, బీజీఆర్ విగ్రహం వైపు అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.
నాంపల్లి వైపు నుంచి కార్లలో వచ్చే ప్రజలు తమ వాహనాలను గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్‌లో పార్కు చేసి.. అజంతా గేట్ (2) నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి వెళ్లాలి.
వీఐపీ కారు పాస్ ఉన్న వారు ఎంజే మార్కెట్ నుంచి గాంధీ భవన్ వరకు వచ్చి ఎడమ వైపు తీసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్-1, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు గాంధీ భవన్ వద్ద యూటర్న్ తీసుకొని గేట్-1, సీడబ్ల్యూసీ గేట్ ద్వారా లోపలికి వెళ్లాలి.
చేప ప్రసాదం అనంతరం వీఐపీ వాహనాలు వీఐపీ గేట్, సీడబ్ల్యూసీ గేట్ నుంచి అదాబ్ హోటల్ నుంచి నాంపల్లి మీదుగా బయటకు వెళ్లిపోవాలి.