BRS Charge Sheet On Congress: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్, రేవంత్ రెడ్డి పాలన.. రైతు సంక్షేమానికి రాహు కాలం, వ్యవసాయానికి గ్రహణం అని హరీశ్ రావు మండిపాటు
కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు హరీశ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థుల దగ్గరినుంచి అవ్వా తాతల వరకు అన్ని వర్గాల వారిని రోడ్లు ఎక్కేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
Hyd, Dec 8: కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు హరీశ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థుల దగ్గరినుంచి అవ్వా తాతల వరకు అన్ని వర్గాల వారిని రోడ్లు ఎక్కేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
ఊసరవెల్లిలా రంగులు మార్చే రేవంతూ.. లగచర్ల గిరిజన రైతుల దెబ్బకు జడిసి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నడు అన్నారు. రేవంత్ కి నిజంగా ఉపాధి కల్పనపై చిత్తశుద్ది ఉంటే.. మా కేటీఆర్ చెప్పినట్టుగా కల్వకుర్తిలో నీకున్న 500 ఎకరాల భూమి ఇవ్వు అని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి దావోస్ కు పోయి అక్కడ కూడా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. అయన మాట్లాడిన భాషకి అర్ధం ఏమిటో ఆ భగవంతునికే తెలియాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధాన్యం ఎంత పండిందో దాచేస్తే దాగని సత్యం అన్నారు. 2014-15 లో 68లక్షల టన్నుల వరి పండితే.. 2023-24 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందని గుర్తు చేశారు.
2014-15లో కోటి 31లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం, 2023-24 నాటికి రెండు కోట్ల 22లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. రికార్డు స్థాయిలో పంట పండిందని రేవంత్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నడు, మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? అన్నారు. రేవంత్ పాలన.. రైతు సంక్షేమానికి రాహు కాలం, వ్యవసాయానికి గ్రహణం అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చ
Here's Video:
అధికారంలోకి రాంగనే మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతానని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ నిలుపుకోలేదు అని దుయ్యబట్టారు.
కనిపించిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టి, నాలుగు కోట్ల ప్రజలను మోసం చేయగలిగినోడికి, మూడు కోట్ల దేవతలను మోసం చేసుడు పెద్ద ముచ్చటనా? చెప్పాలన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా రూ. 72వేల కోట్లు జమచేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నరా?..ఒకే ఒక్క కేసీఆర్ గారు తప్ప అన్నారు.