BRS Water War: మరో నీటి యుద్ధానికి సిద్ధమైన బీఆర్ఎస్, ఈ సారి కర్ణాటక ప్రాజెక్టుపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు రెడీ
తుంగభద్ర నదిపై చేపడుతున్న బ్యారేజీ వల్ల శ్రీశైలానికి వచ్చే నీరు ఆగిపోతుందని.. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బీఆర్‌ఎస్. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తెలంగాణ రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు
Hyderabad, FEB 22: పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సాగునీటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఎన్నుకుంది బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party). తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు రెడీ అవుతోంది. కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ.. నీటి పోరు యాత్రలకు (Water War) సిద్ధమవుతోంది. ఓవైపు పాదయాత్రలు, మరోవైపు బస్సు యాత్రలు చేసి.. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని రైతుల మద్దతు కూడగట్టేందుకు ప్రణాళిక రచించింది గులాబీ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వాటర్ వార్ ప్రారంభమైంది. కృష్ణా జలాల వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో రాష్ట్రానికి నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీఆర్‌ఎస్ మండిపడుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల కృష్ణా జలాలపై పూర్తిగా హక్కులే కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ (BRS) హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో.. దాన్ని అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేసింది. అయితే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ (Congress) నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీల మధ్య నీటి వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది.
ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి (KRMB) అప్పగించిందంటూ.. ఇటీవల నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది బీఆర్‌ఎస్. అటు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టింది. మేడిగడ్డకు వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని గులాబీ బాస్ కేసీఆర్ నల్లగొండ సభలోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించింది గులాబీ పార్టీ.
ఇందుకోసం.. నీటిపోరు యాత్ర పేరిట ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఒకేసారి యాత్రలు చేపట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఓవైపు పాదయాత్రలు చేస్తూనే.. మరోవైపు బస్సు యాత్రల ద్వారా కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని రైతుల మద్దతు కూడగట్టాలని భావిస్తోంది బీఆర్‌ఎస్. ఈ క్రమంలోనే మేడిగడ్డ బూచితో గోదావరి జలాలను ఎత్తిపోయకుండా పంటలు ఎండిపోయేందుకు కాంగ్రెస్ కారణమవుతోందని మండిపడుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు.
తాజాగా కర్నాటక ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న బ్యారేజీ నిర్మాణాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది బీఆర్‌ఎస్. తుంగభద్ర నదిపై చేపడుతున్న బ్యారేజీ వల్ల శ్రీశైలానికి వచ్చే నీరు ఆగిపోతుందని.. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బీఆర్‌ఎస్. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తెలంగాణ రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు గులాబీ నేతలు. అయితే.. నీటి పోరు యాత్రలపై బీఆర్‌ఎస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మార్చి నెలలోనే వీటిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ యాత్రలు ముగియగానే.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.