ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫేక్‌న్యూస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.ఏపీ సీఈవో పేరుతో ఫేక్ షెడ్యూల్ ప్రచారంలో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఈ నకిలీ వార్తతో తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధంలేదని సీఈవో స్పష్టం చేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ఎన్నికల షెడ్యూల్ వైరల్‌గా మారింది. ఫలానా తేదీన ఎన్నికలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రచారాన్ని నమ్మొద్దు.. ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే ఎంపీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గత కొన్నిరోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. అందులో భాగంగా రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సింది.
వీటితోపాటు జమ్మూ కాశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ సమాయత్తం అయింది. ఇందుకోసం మార్చి 8, 9వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కావాలని ఈసీ భావిస్తోంది. ఆ తర్వాత మార్చి 12, 13వ తేదీల్లో ఎలక్షన్ కమిషన్ బృందం జమ్మూకాశ్మీర్ లో పర్యటించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఎన్నికల నిర్వహణపై ఈసీ ఒక అంచనాకు రానుంది. ఈ టాస్క్ ముగిసిన తర్వాత మార్చి రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
గత లోక్సభ షెడ్యూల్ను ఈసీ మార్చి 10 ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.