New National Highway Between TS-AP: తెలుగు రాష్ట్రాల మధ్య ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్ ఆమోదం, రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో కొత్త జాతీయ రహదారి నిర్మాణం
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది.
Hyd, Jan 28: తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను (Centre Approves DPR for new national highway) ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ప్రణాళిక ప్రకారం.. ఏపీ, తెలంగాణలను (Andhra Pradesh and Telangana) అనుసంధానిస్తూ 174 కి.మీ. మేర జాతీయ రహదారి (ఎన్‌హెచ్–167కె)ను రూ.600 కోట్లతో నిర్మిస్తారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్ నుంచి ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఏపీ పరిధిలో కర్నూలు జిల్లాలోని ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. అలాగే తెలంగాణ పరిధిలో కల్వకుర్తి, తాడూరు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్‌లలో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై రూ.600 కోట్లతో ఓ వంతెననూ నిర్మిస్తారు.
కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల మధ్య దాదాపు 2 కి.మీ. మేర ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది. కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికార వర్గాలు తెలిపాయి. ఈ జాతీయ రహదారి పూర్తయితే హైదరాబాద్- తిరుపతి మధ్య 42 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి కర్నూలు మీదగానే వెళ్ళాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కల్వకుర్తి , కొల్లాపూర్ మీదుగా నంధ్యాల వెళ్లి అక్కడ కర్నూలు-తిరుపతి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే హైవే మీదుగా వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్- నంద్యాల మధ్య దూరం 296 కిలోమీటర్లు, కొత్త జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే అది 254 కిలోమీటర్లకు తగ్గుతుంది.