Bandi Sanjay Arrest Row: ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు, విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, ముందస్తు చర్యగా అరెస్టు చేశామని తెలిపిన పోలీసులు, హైకోర్టులో రేపు విచారణకు పిటిషన్
బీజేపీ లీగల్ సెల్ ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.
Hyd, April 5: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ లీగల్ సెల్ ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. గురువారం డివిజన్ బెంచ్‌లో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. అయితే హౌస్ మోషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది.
అదే విధంగా బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చారు. అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పోలీసులు పాటించలేదని పిటిషన్‌లో తెలిపారు.
బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని... అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పోలీసులు పాటించలేదని పేర్కొన్నారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు, పార్టీ సభ్యులకు పోలీసులు వెల్లడించలేదని తెలిపారు. సీఆర్పీసీ 50 కింద అరెస్టు విషయాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులకి చెప్పాలని అన్నారు.
తన అత్తగారి 10వ దినంకు హాజరుకావాల్సి ఉన్నందున బండి సంజయ్ కరీంనగర్‌కు వెళ్లారని.. రాత్రి 11:30 నిమిషాలకు అక్రమంగా బండి సంజయ్ను అరెస్టు చేశారని పిటిషన్‌లో బీజేపీ పేర్కొంది. పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. రేపు విచారణ జరుపనుంది.
బండి సంజయ్‌పై కుట్ర కేసు నమోదు, భువనగిరి కోర్టుకు తరలింపు, ఈటెల, రఘునందన్ రావు అరెస్ట్
కాగా తీవ్ర ఉద్రిక్తత నడుమ మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లో బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బలవంతంగా పోలీస్ వాహనంలో బొమ్మలరామారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. వికారాబాద్ (Vikarabad), కమలపూర్ (Kamalapur)లో పేపర్ లీకేజ్ (Paper Leakage)లపై బండి సంజయ్ ప్రెస్ నోట్ (Press Note) ఇచ్చారని, పేపర్ లీకేజ్‌లకు ప్రభుత్వమే భాద్యతంటూ.. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR)లో పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామన్నారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
మాస్ కాపీయింగ్ (Mass Copying) వ్యవహారంలో బండి సంజయ్ పాత్రకు సంబంధించి ఎక్కడా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో మెన్షన్ చేయలేదు. కేవలం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నారని... అందుకే అరెస్టు చేసి.. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నామని పోలీసులు తెలిపారు.
బండి సంజయ్, ప్రశాంత్ల చాంటింగ్లపై పోలీసులు దృష్టి సారించారు. పేపర్ లీక్ కంటే ముందురోజు ప్రశాంత్‌తో బండి సంజయ్ చాటింగ్ చేశారని, సంజయ్‌తో ప్రశాంత్ 100కు పైగా కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న సంజయ్‌కు పేపర్ పంపాక కూడా ప్రశాంత్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. ప్రశాంత్ వాట్సాప్ చాట్‌ను అధికారులు రిట్రివ్ చేస్తున్నారు.