CM KCR Speech Highlights: ఉచిత విద్యుత్ పేటెంట్ వైఎస్సార్‌దే, కరోనాపై కన్నేసి ఉంచాం, రైతులకు రుణమాఫీ వందకు 100 శాతం చేసి తీరుతాం, బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ స్పీచ్‌లో హైలెట్ పాయింట్స్ ఇవే
ఉచిత విద్యుత్ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు.
Hyderabad, Mar 17: బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR Speech Highlights) మాట్లాడారు. తెలంగాణలో కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR full speech) స్పష్టం చేశారు. సభ్యులు సూచించిన అనేక అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. గత వారం రోజుల నుంచి రాష్ర్టంలో కరోనా పెరుగుదల కనిపిస్తుంది.
కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. దేశం పరిస్థితి కంటే మన రాష్ర్టం పరిస్థితి మెరుగ్గా ఉంది. కొన్ని గురుకుల హాస్టళ్లల్లో, మంచిర్యాల పాఠశాలలో కొన్ని కరోనా కేసులు ఎక్కువ వచ్చాయి. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. అన్ని శక్తులను ఉపయోగించి కరోనాను అదుపులో ఉందచేందుకు యత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు గణనీయంగా పెంచామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డులు పెంచలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడటం సరికాదన్నారు. కొత్తగా ఆయన సభకు వచ్చారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. అది సరికాదు. 2014 కంటే ముందు 29 లక్షల రేషన్ కార్డులుండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 39 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు.
ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని (YSR) తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి పునరుద్ఘాటించారు. ఉచిత విద్యుత్ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు.
ఆనాడు రూ. 200 పెన్షన్ ఇస్తే ఈనాడు రూ. 2016 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. 29 లక్షల 21 వేల 828 పెన్షన్లు ఆ రోజు ఉంటే.. నేడు 39,36,520ల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులు అందరికీ ఇస్తున్నాం. అప్పుడు కార్డు మీద 20 కేజీల పరిమితి పెట్టిండ్రు. ఇప్పుడు ఆ పరిమితి ఎత్తేసి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ ఇస్తున్నామని చెప్పారు.
గంధమల్ల, మల్లన్న సాగర్ నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, వరంగల్‌లో ఇచ్చే రేటును పల్లెల్లో ఇవ్వరు. చట్టాలను అనుసరించి, నిబంధనలు పాటిస్తూ.. భూములకు నష్ట పరిహారం ఇస్తున్నాం. ఎవరికీ నష్టం జరగనివ్వం. గజ్వేల్ పట్టణానికి సమీపంలో ఏడున్నర వేల ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎస్సార్ఎస్పీ తర్వాత నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు.. ఇది 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నాం. ఇది చాలా ప్రాంతాలకు వనరుగా ఉంటుంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై 371 కేసులు వేశారు. వీటన్నింటి మీద ఫైట్ చేస్తూ.. ప్రాజెక్టును కంప్లీట్ చేస్తున్నాం. దేశంలో ఎవరికీ ఇవ్వని విధంగా పరిహారం ఇస్తూ, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ర్టంలోని రైతులకు రుణమాఫీ వందకు 100 శాతం చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్లు కేబినెట్ అఫ్రూవ్ చేసిన ప్రసంగాన్ని చదువుతారు. మేం చేసింది పెద్దది కాబట్టి.. బుక్ పెద్దగా ఉంటుంది. మేం చేసింది చాలా ఉంది కాబట్టి.. ప్రసంగం ఎక్కువే ఉంటుంది. మేం చేసిన దాంట్లో మేం చెప్పింది చాలా తక్కువ అని తెలిపారు. 25 వేల వరకు ఎంత మందికి రుణాలు ఉండేనో... వారికి గత సంవత్సరం మాఫీ చేశాం. మిగతా వారి విషయంలో రేపు ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రుణమాఫీ చేయలేదు. పోడు భూముల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 60 ఏండ్ల పాపాన్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించుకుంటాం. పోడు భూముల విషయంలో పీఠముడి ఉందన్నారు.
కాంగ్రెస్ హయాంలో నీటి తిరువా ముక్కుపిండి వసూలు చేశారు. తెలంగాణ రాష్ర్టంలో నీటి తిరువాను ఎత్తేశామన్నారు. ఉచిత కరెంట్‌ను రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. కానీ కరెంట్ వచ్చేది కాదు.. ఉత్త కరెంట్ కిందనే పోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ర్టంలో ఉచిత 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. హై క్వాలిటీ పవర్ సప్లయి అవుతోంది. వరద కాల్వ మీద వందల, వేల మోటార్లను పెట్టుకునే వారు. కాకతీయ కాల్వ మీద కూడా వేల మోటార్లు పెట్టుకున్నప్పటికీ.. వాటి వద్దకు వెల్లొద్దని కరెంట్ అధికారులకు తాను సూచించానని చెప్పారు.
రైతుల విషయంలో చాలా లిబరల్‌గా ఉన్నామని చెప్పారు. యాసంగిలో 52 లక్షల ఎకరాల సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం విషయంలో చాలా విషయాలు వస్తాయన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాడు 128 ఎకరాల్లో పాలీ హౌజ్‌లు ఉంటే.. ఇప్పుడు 1300 ఎకరాల్లో ఉన్నాయి. సబ్సిడి కూడా 75శాతం ఇస్తున్నాం. 6 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాల భ్రమల నుంచి భట్టి బయటకు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు.
రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. శాసనసభ వేదికగా రెండు, మూడు రోజుల్లోనే గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఉద్యోగుల మీద తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామన్నారు. మా ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామని చెప్పాం.. దాన్ని అమలు చేస్తున్నాం.. తాను ప్రకటించిన తర్వాత ఉద్యోగులు తప్పకుండా హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు.
అడ్వకేట్ దంపతుల హత్య కేసుతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్టంలో పోలీసు శాఖ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో కూడా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదు. గత శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేయలేదు. ప్రజాక్షేత్రంలో నిబద్దతగా ఉంటున్నాం. అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరం. ఖండిస్తున్నామని తెలిపారు.
ఈ హత్య కేసులో ఎవరున్నా సరే వదిలిపెట్టం. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశాం. కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కప్ప కుమార్, శ్రీనివాస్, బడారి లచ్చయ్య, వెల్ది వసంతరావును పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాది దంపతుల హత్య కేసులో మాకు, మా పార్టీకి అసలు ప్రమేయం లేదు. హత్య కేసులో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాడు. ఆ విషయం తెలిసిన మరుక్షణమే పార్టీ నుంచి తొలగించాం. అతన్ని అరెస్టు కూడా చేశారు. వారు కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసు విషయంలో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదన్నారు. ఈ కేసు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ శాసనసభలో చురకలంటించారు. గవర్నర్ తమిళిసై వ్యవసాయ రంగం గురించి గొప్పగా చెప్పారు. అయితే కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో వేల సంఖ్యలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు అని భట్టి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క ఉప సభాపతిగా కూడా పని చేశారు. సభా నిబంధనలు మన కంటే వారికే ఎక్కువ తెలుసు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై మనం చెప్పాల్సింది చెప్పాం. సభ నుంచి , బయటి నుంచి కూడా చెప్పాం. సభలో రాష్ర్టానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మంచిది. మీ పార్టీ సభ్యులు.. పార్లమెంట్‌లో ఉన్నారు కాబట్టి.. కేంద్ర పరిధిలో వచ్చే విషయాలు అక్కడ మాట్లాడితే మంచిదని భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు.
కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎమ్మెల్యే భట్టికి ఇచ్చిన సమయం మించిపోవడంతో స్పీకర్ పోచారం మరో సభ్యుడికి అవకాశం ఇచ్చారు. దీంతో భట్టి మాట్లాడుతూ.. తమకు తగిన సమయం కేటాయించకపోవడం సరికాదన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్‌ను కూడా నిర్దేశించే పద్ధతి భట్టి విక్రమార్కకు సరికాదన్నారు సీఎం కేసీఆర్. సభలో ఇలా మాట్లాడటం భట్టి విక్రమార్కకు పరిపాటిగా మారింది.
26వ తేదీ వరకు బడ్జెట్ సెషన్ ఉంటది. పద్దులపై చర్చ సందర్భంగా కూడా మాట్లాడొచ్చు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చారు. సభ్యుల సంఖ్యను బట్టి, సభా నియమాలు పాటిస్తూ ముందుకు పోవాలన్నారు. కేటాయించిన సమయం కంటే నాలుగైదు నిమిషాలు ఎక్కువగానే ఇస్తున్నాం. సభకు రావొద్దని మేమేందుకు చెప్తామని సీఎం అన్నారు. సభకు రావొద్దని చెప్పే అవసరం తమకు ఎందుకుంటుంది. ఇలా మాట్లాడటాన్ని అంగీకరించము అని కేసీఆర్ స్పష్టం చేశారు.