CM KCR Mumbai Tour Highlights: సీఎం కేసీఆర్ ముంబై పర్యటన విజయవంతం, జాతీయ స్థాయిలో అందర్నీ ఏకం చేస్తామని ప్రకటన, దేశ రాజకీయాలపై చర్చల కోసం ప్రముఖులతో భేటీ
ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో వేర్వేరుగా సీఎం కేసీఆర్ (Telangana CM K Chandrashekar Rao) సమావేశమై జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Hyd, Feb 21: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంబై పర్యటన (CM KCR Mumbai Tour Highlights) విజయవంతంగా ముగిసింది. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో వేర్వేరుగా సీఎం కేసీఆర్ (Telangana CM K Chandrashekar Rao) సమావేశమై జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ రెండు సమావేశాల్లోనూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బయల్దేరారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా.. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వర్ష బంగ్లాకు తన బృందంతో వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో కలిసి కేసీఆర్ బృందం లంచ్ చేసింది. అనంతరం ఉద్ధవ్ థాకరే, కేసీఆర్ కలిసి దేశ రాజకీయాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా, శరద్ పవార్ ( NCP Chief Sharad Pawar) ఇంటికి వెళ్లారు.
అక్కడ శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, సుప్రియా సులేతో కేసీఆర్ సమావేశమై గంటన్నర పాటు జాతీయ రాజకీయాలపై చర్చించారు. శరద్ పవార్‌తో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ ముంబై ఎయిర్‌పోర్టుకు బయల్దేరి, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
శరద్ పవార్ తో భేటీలో ఏం మాట్లాడారు.
1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్‌ది అని కొనియాడారు. దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత. దేశం ప్రస్తుతం సరైన మార్గంలో నడవడం లేదు. దళితుల వికాసం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా దేశంలో సరైన పాలన లేదు. అందుకే దేశం కోసం.. సరైన అజెండ ఉండాలి. దేశంలోనే అత్యంత అనుభవం ఉన్న నేత శరద్ పవార్. తెలంగాణ ఏర్పాటులోనూ శరద్ పవార్ ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మరవలేం. ఖచ్చితంగా తమతో కలిసి పనిచేస్తా అన్నారు. అందరం మళ్లీ భేటీ అవుతాం. ఇంకా ఇతర నేతలతో కూడా మాట్లాడి ముందుకు వెళ్తాం. అందరినీ కలుపుకొని వెళ్తాం. కొన్ని రోజుల తర్వాత ప్రజల ముందు మా అజెండ పెడతాం.. మా కార్యచరణ ఏంటో త్వరలోనే తెలియజేస్తాం.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.
మహరాష్ట్ర సీఎంతో భేటీలో ఏం మాట్లాడారు
దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించాం. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించాం.. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమే.. మున్ముందు పురోగతి వస్తుందన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
దేశ రాజకీయాలపై చర్చించేందుకే మహారాష్ట్రకు వచ్చాను. కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించాం. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. వైఖరి మార్చుకోకుంటే బీజేపీకి ఇబ్బందులు తప్పవు అని సీఎం హెచ్చరించారు. హైదరాబాద్ రావాలని ఉద్ధవ్ థాకరేను కోరుతున్నాను. ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతాం. శివాజీ, బాల్ ఠాక్రే వంటి యోధుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పోరాడుతాం. పటిష్టమైన దేశం కోసం అందరూ కృషి చేయాలి. దేశంలో గుణాత్మకమైన మార్పు అవసరం. అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. రాబోయే రోజుల్లో కలిసి పని చేయాలని నిర్ణయించాం. త్వరలో హైదరాబాద్‌లో లేదా మరో చోట అందరం నేతలం కలుస్తాం. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో తెలంగాణ స్వరూపం మారిపోయింది. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దు 1000 కిలోమీటర్లు ఉంది. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. 75 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు నెలకొన్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు.