CM KCR Press Meet Highlights: మేము 103 మంది ఉన్నాం, దమ్ముంటే టచ్ చేసి చూడు, బండి సంజయ్‌కి సవాల్ విసిరిన సీఎం కేసీఆర్, కేంద్రం చేతకానితనాన్ని రాష్ట్రాలపై రుద్దుతారా అంటూ మండిపాటు, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు ఇవే
ఆదివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో (CM KCR Press Meet Highlights) మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై, రాష్ట్రంలోని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ( BJP State president Bandi Sanjay Kumar) నోటి కొచ్చినట్టు మితిమీరి అడ్డం పొడవు మాట్లాడుతున్నాడు.
Hyd, Nov 7: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో (CM KCR Press Meet Highlights) మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై, రాష్ట్రంలోని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ( BJP State president Bandi Sanjay Kumar) నోటి కొచ్చినట్టు మితిమీరి అడ్డం పొడవు మాట్లాడుతున్నాడు.
ఇప్పటిదాకా ఎన్ని మాట్లాడినా, ఎలా మాట్లాడినా.. నా స్థాయి కాదు, చిన్న వాడన్న ఉద్దేశంతో పట్టించుకోకుండా క్షమిస్తూ వచ్చాను. కానీ ఏడేండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న తెలంగాణ రైతుల బతుకు ఆగం చేసేలా, ధర్నాలతో రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు చేస్తున్న ప్రకటనలతో బాధ కలుగుతోంది. నన్ను జైలుకు పంపుతామని అంటున్నాడు. ఎందుకింత అహంకారం. దమ్ముంటే టచ్ చేసి చూడండి...’’ అని సీఎం కేసీఆర్ (Chief Minister K Chandrasekhar Rao) సవాల్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. వరి వేయండి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనేలా మెడలు వంచుతాం అంటున్నాడు. నాదా, కేంద్రానిదా ఎవరి మెడ వంచుతారు. బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.
ఈ సొల్లు మాటలతో ఏర్పడిన గందరగోళం తొలగించేందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. ఢిల్లీ బీజేపీ వరి సాగు చేయొద్దు అంటోంది. రాష్ట్రంలోని సిల్లీ బీజేపీ వరి వేయాలని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పనికిమాలిన మాటలు నమ్మి వరి వేస్తే దెబ్బతింటాం. తెలంగాణ నుంచి వరి కొంటామని కేంద్రం నుంచి ఆర్డర్ తెస్తే.. నాతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 70, 80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేలా చూస్తాం. అలా తెచ్చే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? కేంద్రం పునర్విభన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి తెలంగాణకు రూ. పది పనిచేశారా? అంటూ విరుచుకుపడ్డారు.
యాసంగిలో వరి వద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారన్నారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మంత్రి వరి వద్దన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రైతుల ఆత్మహత్యలు, చాలా కకావికలమైన వ్యవసాయం, వలసలు, పాలమూరు, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి రైతులు కూడా కూలి పనుల కోసం హైదరాబాద్‌కు రావడం.. దారుణ పరిస్థితులుండేవన్నారు. రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ప్రజలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశాన్ని అధికార రూపంలో కట్టబెట్టారన్నారు.
స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మకమైన పద్ధతిలో ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి.. పల్లెలు చల్లగా ఉండేటట్లు చేయాలి.. వృత్తి పనులందరికీ పనులు దొరకాలని అనే స్పష్టమైన పాలసీని తీసుకున్నామన్నారు. ఆ దిశలో బలమైన అడుగులు రాష్ట్ర ప్రభుత్వం వేసిందన్నారు. అందులో మొట్టమొదట మొదలు పెట్టింది.. అడుగంటి పోయిన భూగర్భ జలాలను పెంచేందుకు.. మిషన్ కాకతీయ పేరిట చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.
ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆ తర్వాత చాలా అస్తవ్యస్తంగా.. లోపభూయిష్టంగా ఉన్న కరెంటును పూర్తిగా సంస్కరించి.. అనేక పెట్టుబడులు పెట్టి.. 24 గంటలు అన్ని రంగాలకు భారతదేశంలో మరో రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చామన్నారు. అది సరిపోదని పెట్టుబడుల కోసం 93శాతం సన్న, చిన్నకారు రైతులకు కోసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం అమలు చేసినట్లు చెప్పారు.
యాసంగిలో వరి సాగు వద్దు, ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చేయమని తేల్చిచెప్పిన తెలంగాణ సర్కారు
మొదట పంటకు రూ.4వేలతో ప్రారంభించి.. దాన్ని రూ.5వేలకు పెంచి.. ఎకరానికి సంవత్సరానికి రూ.10వేలు పెట్టుబడి కోసం ఇచ్చే ప్రభుత్వం ప్రపంచంలోనే ఒకేఒకటి తెలంగాణ ప్రభుత్వం.. చితికిపోయిన రైతులు మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకు దాదాపు రూ.1300-రూ.1400 కోట్లు యావత్ రైతాంగానికి సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది.. రైతులపై పైసా భారం లేకుండా రైతుబీమా పథకం అమలు చేశామన్నారు.
గతంలో ఎరువులు దొరికేవి కావని.. రోజుల తరబడి రోజుల తరబడి లైన్లలో నిల్చోవడం.. గలాటాలు కావడం.. చివరకు పోలీస్‌స్టేషన్ల ఎరువు బస్తాలు పెట్టిన రోజులు చూశామన్నారు. ఆ రోజు మొత్తం వాడిన ఎరువుల్లో.. ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. రెండు పంటలకు కలిపి 50-55లక్షల టన్నుల ఎరువులు వాడకం జరుగుతుందన్నారు. గతంలో 13-14లక్షలుంటేనే పోలీస్‌స్టేషన్లలో పెట్టి విక్రయించారన్నారు.
కేంద్రాన్ని ఒప్పించి ఎండాకాలంలో ఏ రాష్ట్రం తీసుకోని సమయంలో తీసుకున్నామని.. ఆగమేఘాలపై గోడౌన్లు నిర్మించామన్నారు. మంచి విత్తనాలు, ఎరువులు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి, 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, పెట్టుబడికి రైతుబంధు, దురదృష్టవశాత్తు రైతు మరణస్తే రైతుబీమా తదితర చర్యలతో రాష్ట్రంలో అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని చెప్పారు.
రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో, ఢిల్లీలో కొట్లాడుతాం. ధాన్యం కొనుగోలులో మా వాటా ఏంటో చెప్పాలని 6,200 కొనుగోలు కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. అవసరమైతే నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రతినిధులతో ఢిల్లీలో ధర్నాకు దిగుతాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకొనేందుకు అన్నిరకాల పోరాటానికి సిద్ధం. చిల్లరగాళ్లు, కిరికిరిగాళ్లు, కిరాయిగాళ్లు తెలంగాణను ఆగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా? నా ప్రాణం పోయినా సరేనని ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని తెచ్చా. ఇకపై మన్నించం. కేంద్రంతో కొట్లాడేందుకు ఎవరిని కలుపుకోవాలో వారిని కలుపుకొంటామని స్పష్టం చేశారు.
వ్యవసాయ చట్టాల పేరిట రైతుల ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్ని స్తోంది. ఏడాదికాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల మీద కార్లు ఎక్కించి చంపుతున్నారు. బృందాలుగా ఏర్పడి రైతులను కొట్టాలని బీజేపీ సీఎంలే రెచ్చగొడుతున్నారు. ఉత్తర భారత్‌లో రైతుల ఆందో ళనలకు అండగా ఉంటాం. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని మేమూ ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
ఇన్నాళ్లూ పిచ్చికూతలు కూసినా క్షమించి వదిలేసినాం. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి బిడ్డా. మాది పవర్ ఫుల్ పార్టీ. మాకు 103 మంది ఎమ్మెల్యేలు, మా మిత్రపక్షం ఎంఐఎంకు మరో ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. 119లో 110 మందిమి మేమే. మేం ఢిల్లీ నుంచి కాకుండా.. ప్రజలు నామినేట్ చేస్తే వచ్చాం. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చు. సిద్ధంగా ఉన్నాం. కానీ వీధుల్లో ఏం మాట్లాడుతున్నారు.
కుక్కల్లా ఇష్టమొచ్చినట్లు మొరుగుతరా? మేం ఉద్యమాలు చేసినోళ్లం. బీ కేర్‌ఫుల్.. కుసంస్కారులు, హీనుల్లా రాజకీయ విలువలు దిగజారుస్తూ ఎంతకాలం మోసం చేస్తరు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి ఓ మెడికల్ కాలేజీనో, ఇంకేదో తెచ్చిండా? ఆ మనిషికి ఇంగ్లిషో, హిందీయో వస్తదా? కేంద్రం నుంచి వచ్చిన లెటర్లు అర్థమైతాయా? అలాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వద్దని లేఖ ఇచ్చిండని అన్నారు.
ఉప ఎన్నికలు అన్నంక ఓ పార్టీ ఓడుతుంది, మరొకరు గెలుస్తారు. మొన్నసాగర్‌లో బీజేపీ ఓడి డిపాజిట్ పోయింది. హుజూరాబాద్‌లో ఓడితే భూమి బద్దలవుతుందా. హుజూర్‌నగర్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై గెలిచాం. తెలంగాణ ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అంటున్నారా. ఈ రోజు దేశంలో 30కిపైగా సీట్లలో ఉప ఎన్నిక జరిగితే.. బీజేపీవి అన్ని పొయాయి. అంటే బీజేపీకి వ్యతిరేకంగా తీర్పువచ్చినట్టా? ఉప ఎన్నికల పరిణామాలను మేం పట్టించుకోం.
అసలు మీకు రాష్ట్రంలో ఆర్గనైజేషన్ ఉందా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 107 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. అలాంటిది ఇప్పుడు ఉప ఎన్నిక రాగానే సోషల్ మీడియాలో అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. దళితులు, ఎస్టీల కోసం పెట్టిన చట్టాన్ని ఓ వెధవ లొట్టపీసు చట్టం అంటున్నాడు. వారికి చట్టాలు, కోర్టులు అంటే గౌరవం లేదు. దళితులు, గిరిజనులు అంటే భయం లేదు. కేసీఆర్ బతికి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ దళితబంధు స్కీం ఆగదు. కేవలం హుజూరాబాద్‌లోనే కాదు, రాష్ట్రమంతటా అమలు చేస్తామని తెలిపారు.’’
ఏడేండ్లలో దేశాన్ని నాశనం చేశారు
టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా అడుగుతున్నా.. బీజేపీ ఏడేండ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టారు. దళితులు, ఎస్టీలు, బీసీలు, నిరుద్యోగులు, రైతులకు ఏదైనా చేశారా? అంతర్జాతీయ సరిహద్దు సమస్యలు, మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రాజకీయంతో దేశాన్ని నాశనం చేశారు. చైనా మన అరుణాచల్‌ప్రదేశ్‌లో ఊళ్లకు ఊళ్లే కడుతూ దంచుతోంది.
అక్కడ చేతకాక బీజేపీ తోకముడిచింది. జీడీపీ, ఆహార భద్రతను దెబ్బతీసింది. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలను దెబ్బతీసింది. అడ్డగోలు పన్నులతో ప్రజల మీద భారం పెంచింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు వంటి అంశాల్లో రాష్ట్రాల మీద ఒత్తిడి పెంచి బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ఇకపై ఇలాంటి వాటిమీద అటు కేంద్రం, ఇటు రాష్ట్ర బీజేపీ వెంట పడతం.
కళ్లు నెత్తికొచ్చాయా?
బీజేపీ నేతలు మితిమీరి మాట్లాడుతూ నన్ను నిందిస్తున్నా పడుతూ వచ్చినం. కానీ ‘కేసీఆర్‌ను జైలుకు పంపుతం, మా వ్యూహం మాకుంది, మా జాతీయ అధ్యక్షుడు నాకు చెప్పాడు’ అని బండి సంజయ్ అంటున్నడు. నన్ను జైలుకు పంపుతరా? బలుపా.. అహంకారమా? కళ్లు నెత్తికొచ్చాయా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత అహంకారం ఎందుకు? పరిపాలించే శక్తిలేని కేంద్రం చేతకానితనాన్ని రాష్ట్రాల మీద రుద్ది సీఎంలను జైలుకు పంపుతరా? కేసీఆర్‌ను జైలుకు పంపుతరా? నన్ను ముట్టి చూడు బిడ్డా.. టచ్ చేసి చూడు కేసీఆర్‌ను. నన్ను జైలుకు పంపి ఇక్కడ బతికి బట్టకట్టి తిరుగుత అనుకుంటున్నవా? మేం చేతులు ముడుచుకుని కూర్చున్నమా? అని ప్రశ్నించారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై అన్నీ అబద్దాలే
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం మాట్లాడేవన్నీ అబద్ధాలే అని సీఎం కేసీఆర్ అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 105.52 డాలర్లుగా ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లుగా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లను దాటలేదు. ఆయిల్ ధర క్రాష్ అయి చాలా సార్లు తగ్గాయి కానీ.. ఏనాడూ పెరగలేదు. అయితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి అని కేంద్రం అబద్ధం చెప్పి ధరలు పెంచుతూ పోయింది. పెంచే పద్ధతి కూడా అడ్డదిడ్డంగా ఉంది. దాంట్లో సుంకం పెంచకుండా సెస్ రూపంలోకి మార్చి ధరలు పెంచారు.
రాష్ట్రాల వాట ఎగ్గొడుతూ.. రాష్ట్రాల నోరుకొడుతున్నారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సెస్ కింద మార్చి లక్షల కోట్లు ఎగ్గొడుతున్నారు. 2014 లో 77 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే ఇప్పుడు రూ.114 చేశారు. డీజిల్ ధర 68 రూపాయలు ఉంటే రూ. 107.40 పైసలు చేశారు.. అని లెక్కలతో సహా సీఎం కేసీఆర్ ప్రజలకు తెలిపారు. మొన్న జరిగిన ఉపఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. కొండంత పెంచి.. పిసరంత ధరలను తగ్గించి ఏదో గొప్ప పని చేసినట్లు చెప్పుకుంటోంది కేంద్రం. అంతే కాదు.. రాష్ట్రాలు కూడా తగ్గించండి అని మాట్లాడుతున్నారు.
కేంద్రాన్ని, రాష్ట్ర బీజేపీని డిమాండ్ చేస్తున్నా. ముందు సెస్ విత్‌డ్రా చేసుకోండి. 2014 రేట్‌కే ఇప్పుడు పెట్రోల్ ఇవ్వొచ్చు.. అని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోయింది తప్పితే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యాట్ పెంచలేదు. ఇప్పటి వరకు పైసా కూడా తీసుకోలేదు. కేంద్రం పెంచింది కానీ.. రాష్ట్రం ఏనాడూ పెంచలేదు. ఏ నైతికతతో మీరు మాట్లాడుతున్నారు. మితిమీరి.. అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.. అంటూ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
దేశం మొత్తం మీద బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్‌లో తెలంగాణ నెంబర్ వన్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.. అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ 7 ఏండ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము 42 వేల కోట్లు మాత్రమే. అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు కూడా వచ్చింది. అందులో ఒకటి నరేగా, ఎన్ఆర్‌హెచ్ఎం, సర్వశిక్షా అభియాన్. వీటి మీద వచ్చిందే.
స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 450 కోట్లు బీఆర్‌జీఎఫ్ ఫండ్స్ రావాలి. అవి ఎగ్గొట్టారు. వాటిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు కేంద్రం మెడలు వంచి తీసుకురారు. మంత్రుల మీద.. ముఖ్యమంత్రుల మీద మాత్రం ఆరోపణలు చేస్తరు. కేంద్రం సహకరించకున్నా కూడా సొంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నం. 5 ఏళ్ల వరకు హైకోర్టునే విభజించలేదు.
రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల వాటా గురించి ఇప్పటి వరకు తేల్చలేదు. మీ అసమర్థతనా.. మీ చేతగాని తనమా.. మీ అవివేకమా? వాటి గురించి ఎందుకు మాట్లాడరు. నవోదయ పాఠశాలల చట్టం ఉంది. దానిపై ప్రధాని మోదీకి ఇప్పటి వరకు 50 సార్లు దరఖాస్తు ఇచ్చా. కానీ.. కొత్త జిల్లాలకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు.
ఎక్కడ పోయిర్రు మరి రాష్ట్ర బీజేపీ నేతలు. ఇక్కడి కేంద్ర మంత్రి ఎక్కడికి పోయిండు. ఎందుకు వీటిపై కేంద్రంతో మాట్లాడరు. ఎందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్క నవోదయ పాఠశాలను తీసుకురాలేకపోయారు. ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు.. అంటూ రాష్ట్ర బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.