ఈటెల రాజేందర్ (File Pic)

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్‌లో 1130 ఓట్ల లీడ్‌ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత 23, 865 ఓట్లు ఆధిక్యంతో ఈటల రాజేందర్‌ భారీ విజయాన్ని సాధించారు.

రెండు రౌండ్లు మినహా ప్రతిసారి ఈటలదే పై చేయి అయ్యింది. హుజురాబాద్‌ నుంచి ఈటల ఏడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బలమైన సెంటిమెంట్‌ ముందు టీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రం, ప్రచారం ఏమాత్రం పని చేయలేదు.

ఈటల గెలుపుతో బీజేపీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాయకుల రాకతో రాష్ట్ర పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబురాల్లో పాల్గొంటున్నారు. ఈటల గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజాలపై ఎత్తుకుని కార్యాలయం ఆవరణలో ఊరేగించారు.

అనంతరం నేతలంతా విజయ సంకేతం చూపుతూ సంబురాల్లో పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, బండి సంజయ్​ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సంబురాల్లో రాష్ట్రస్థాయి నాయకులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.