Hyderabad Octorber 29: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం కోసం కేసీఆర్, జగన్‌లు ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అంతేకాదు షర్మిల పాదయాత్ర, పేర్నినాని వ్యాఖ్యలు యాధృచ్చికం కావు, జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని కామెంట్ చేశారు. ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఖండించడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మీడియాతో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పలు విమర్శలు చేశారు. ‘‘కేసీఆర్ జగన్ మొదటి నుంచి కవలలుగా కలిసి వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర, పేర్ని నాని వ్యాఖ్యలు యాధృచ్ఛికం కావు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర సాగుతోంది. పేర్ని నాని వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ ఎందుకు ఖండించడం లేదు’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల పాలమూరు- రంగారెడ్డిపై ఎన్జీటీ స్టే ఇచ్చిందని, ప్రభుత్వ అలసత్వం వల్లనే ఎన్జీటీలో ఓడిపోయామన్నారు రేవంత్ రెడ్డి. ఎన్జీటీ స్టే వల్ల దక్షిణ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. కేసీఆర్ కమీషన్ల కోసం రీడిజైన్ పేరుతో కాలయాపన చేశారని, ప్రాజెక్టు నిర్మాణాన్ని జూరాల నుంచి శ్రీశైలంకు మార్చారని ఆరోపించారు. పాలమూరు - రంగారెడ్డిని కేసీఆర్ మూడేళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని, ఆరేళ్లు గడిచినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ఎన్జీటీ స్టే వల్ల దక్షిణ తెలంగాణకు మరణశాసనం లిఖించినట్టేనని వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులు శాశ్వత సమాధి కానున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టులపై జగన్‌ను కేసీఆర్ ఎందుకు ఒప్పించలేదని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.