10th Telangana Formation Day Celebrations: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, 21 రోజుల పాటు రోజుకో సంబురం నిర్వహించనున్న కేసీఆర్ సర్కారు, షెడ్యూల్ ఇదిగో..

అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీ నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది.

CM KCR (Photo-Twitter/TS CMO)

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీ నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మంగళవారం ఖరారు చేశారు.

సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. జూన్‌ 2న అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, జూన్‌ 3 నుంచి ఒక్కోరోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగేలా షెడ్యూల్‌ రూపొందించారు.

కూతురు ప్రేమ గురించి తెలియక పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లయిన తెల్లారే ప్రియుడితో కలిసి వధువు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ పెళ్లికూతురు మృతి

21 రోజులపాటు రోజూ ఒక శాఖ గత 9 ఏండ్లలో సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచనున్నది. జూన్‌ 2న ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ సచివాలయంలో ప్రారంభిస్తారు. జూన్‌ 3న రైతు దినోత్సవంతో ప్రగతి నివేదన ప్రారంభమవుతుంది. జూన్‌ 22న తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించటంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఉత్సవాల రోజువారీ షెడ్యూల్‌...

జూన్‌ 2: ఉత్సవాలు ప్రారంభం

దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లోని గన్‌పార్‌ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. తర్వాత సచివాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారు. అదే సమయంలో అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 3: రైతు దినోత్సవం

రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలు ఉంటా యి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి భోజనాలు చేస్తారు.

జూన్‌ 4: సురక్షా దినోత్సవం

పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని ప్రజలకు వివరిస్తారు. రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించేలా రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 5: తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం

నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్తు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్తు రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సింగరేణిలో సంబురాలు జరుపుతారు.

జూన్‌ 6: పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

జూన్‌ 7: సాగునీటి దినోత్సవం

సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌ హాజరవుతారు.

జూన్‌ 8: ఊరూరా చెరువుల పండుగ

గ్రామాల్లో డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంసృతిక కార్యక్రమాలుంటాయి. గోరటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను ఆలపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులు ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

జూన్‌ 9: సంక్షేమ సంబురాలు

ప్రభుత్వం అందించిన ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నియోజకవర్గ స్థాయిలో సభలు జరుపుతారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్రభారతిలో సభ ఉంటుంది.

జూన్‌ 10: సుపరిపాలన దినోత్సవం

అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంసరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును వివరిస్తారు.

జూన్‌ 11: సాహిత్య దినోత్సవం

జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఉంటుం ది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తారు.

జూన్‌ 12: తెలంగాణ రన్‌

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్‌ జరుగుతుంది. ఈ కార్యక్రమం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

జూన్‌ 13: మహిళా సంక్షేమ దినోత్సవం

మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షే మ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులను సన్మానిస్తారు.

జూన్‌ 14: వైద్యారోగ్య దినోత్సవం

రాష్ట్రంలో వైద్యారోగ్యరంగంలో సాధించిన విప్లవాత్మక అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తారు. ప్రభుత్వ వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి గురించి ప్రచారంచేస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 2 వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నూతన భవన నిర్మాణానికి, నిమ్స్‌ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు.

జూన్‌ 15: పల్లె ప్రగతి దినోత్సవం

దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలు ఉంటాయి. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.

జూన్‌ 16: పట్టణ ప్రగతి దినోత్సవం

పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 17: తెలంగాణ గిరిజనోత్సవం

నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి వివరిస్తారు.

జూన్‌ 18: మంచి నీళ్ల పండుగ

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదురొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షిత నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 19: తెలంగాణ హరితోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొకలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.

జూన్‌ 20: తెలంగాణ విద్యాదినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదే రోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు-మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ను ప్రారంభిస్తారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.

జూన్‌ 21: ఆధ్యాత్మిక దినోత్సవం

దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర మత ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 22: అమరుల సంస్మరణ

తెలంగాణ వ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాదులో అమరుల గౌరవార్ధం ట్యాంక్‌ బండ్‌పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిషరిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు.