Telangana: కొవిడ్ విషయంలో ఆందోళన అవసరం లేదు, నిర్లక్ష్యం కూడా తగదు, అందరికీ వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది; సీఎం కేసీఆర్

కరోనా వైరస్ సోకిన వారు ఎక్కువగా ఖర్చు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు...

Telangana CM KCR | File Photo

Hyderabad, July 17: కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. కరోనా వైరస్ సోకిన వారు ఎక్కువగా ఖర్చు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్స లోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి సలహాలు, సూచనలు నిర్ణయాలు

• కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది. కేవలం తెలంగాణలోనే లేదు. తెలంగాణలో పుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలో గురువారం నాటికి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్ సోకింది. అందులో 27,295 మంది (67శాతం) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్ తో చికిత్స అందిస్తున్నాం.

• దేశంలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తున్నది. ప్రజలు పనుల కోసం బయటకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించింది. కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. అయితే కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలి.

• తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్ లోని గాంధి, టిమ్స్ లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశాము. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాము. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ప్రజలకు మెరుగైన వైద్యం సమర్థవంతంగా అందించే విషయంపైనే వైద్య సిబ్బంది ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.

• ప్రజలు హైరానా పడి అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స అందుతున్నది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలి. చికిత్స పొందాలి. తెలంగాణ రాష్ట్రంలో పి.హెచ్.సి. స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా విషయంలో కావాల్సిన వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్ సోకిన వారికి మంచి వైద్యం అందించడానిక ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉంది.

• కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో పెడతారు.

• వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి స్కేల్ అమలు చేయాలని నిర్ణయించారు.

• కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాత వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.

• ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.

• ఔటో సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అందించే పదిశాతం అదనపు వేతనం (కోవిడ్ ఇన్సింటివ్) కొనసాగించాలని ఆదేశించారు. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్య సిబ్బందికి ఇన్సెంటివ్ లకు కొనసాగించాలని నిర్ణయించారు.

• రాష్ట్రంలో పిజి పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

• పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిఎం ఆదేశించారు.

• కరోనా సోకిన వారికి అందించే వైద్యంలో భాగంగా వేసే రెయ్ డిస్ట్రిర్, టోసిలిజుమాబ్ ఇంజక్షన్లు, ఫావి పిరావిర్ టాబ్లెట్లను పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకోవాలి. కావాల్సిన వారికి ఉచితంగానే అందివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కొరత రానీయవద్దు.

• ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాలను బహిరంగ పరచాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now