Haritha Haram: రేపట్నించి తెలంగాణలో 6వ విడత హరితహారం, నర్సాపూర్ అటవీ పునరుద్ధరణకు మొక్క నాటి కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి....
Hyderabad, June 24: తెలంగాణకు హరితహారం ఆరవ విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జూన్ 25న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటి సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని సీఎం అధికారులను ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
జూన్ 25 నుండి ఆగష్టు 15 వరకు ఆరవ విడత తెలంగాణకు హరితహారాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఈ సంవత్సరం జిహెచ్‌ఎంసి పరిధిలో 2కోట్ల 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా ఈ సంవత్సరం జిహెచ్‌ఎంసి పరిధిలో 700 ట్రీ పార్కులతో పాటు 75 చోట్ల యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్.జి.ఆర్.ఐలతో పాటు ఎక్కువ స్థలాలు ఉన్న సంస్థలు, ఖాళీ స్థలాలు ఉన్న దేవాదాయ శాఖ భూములలో 'యాదాద్రి మోడల్ ప్లాంటేషన్' కింద విరివిగా మొక్కలు నాటాలని తెలిపారు. అందుకు అనుగుణంగా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో డివిజన్ గ్రీన్ ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు.