Telangana: బీసీ కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ, కులగణన చేస్తే బీసీ కులాలే నష్టపోతాయని బీఆర్ఎస్ ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ రోజు సమావేశాల్లో బీసీ కుల గణన తీర్మానంను (caste enumeration resolution) శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టారు. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది.
Hyd, Feb 16: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నేడు ఆఖరి రోజు. ఈ రోజు సమావేశాల్లో బీసీ కుల గణన తీర్మానంను (caste enumeration resolution) శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టారు. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ... కులగణనపై తీర్మానం (resolution for caste census) కాదు... చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులగణన చేస్తే బీసీ కులాలే నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలని సూచించారు. ఇది కేంద్రం పరిధిలోనిదని... రాష్ట్రం ఎలా చట్టం చేస్తుంది? అని ప్రశ్నించారు. అలాగే రిజర్వేషన్లు 50 శాతం మించితే ఏం చేస్తారో చెప్పాలన్నారు.
గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కులగణనపై సలహాలు, సూచనలు ఇవ్వకుండా అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. చర్చను పక్కదారి పట్టించవద్దని సూచించారు. బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు.
మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసి రిజర్వేషన్ ఇచ్చినట్లు చెప్పారు. తమ అనుభవాలను క్రోడీకరించి తీర్మానం పెట్టామని తెలిపారు. అన్ని వర్గాలకు... అన్ని రకాలుగా అండగా ఉండాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అని... ఆ ఆలోచనకు అనుగుణంగా తీర్మానం ఉందన్నారు.శాస్త్రీయంగా ప్రణాళిక రూపొందించే క్రమంలో సర్వే ఉంటుందన్నారు. సలహాలు, సూచనలు తీసుకోవడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. అసలు బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను సభకు ఎప్పుడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
పదేళ్లయినా ఆ నివేదికను రహస్యంగానే ఉంచారని ఆరోపించారు. నివేదికను ఒక కుటుంబం వద్ద పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలకు ఇంటింటి సర్వే చేస్తామన్నారు. భేషజాలకు పోకుండా సూచనలు ఇవ్వాలని కోరారు. తీర్మానానికి చట్టబద్ధత లేదని చెప్పడం కాదని... అనుమానం ఉంటే సూచనలు ఇవ్వాలన్నారు.
మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం చేశాం. మీరు అడగకుండానే సభలో పెట్టాం. స్వయంగా మేమే ముందుకు వచ్చి చేస్తున్నాం. విస్పష్టంగా చెప్తున్నాం.. పాలితులుగా ఉన్నవారిని పాలకులుగా తయారుచేయడమే మా ఉద్దేశం. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వాళ్ల ఆర్థిక ప్రయోజనాలను నిలబెట్టాలని భావిస్తున్నాం. ఇంతమంచి తీర్మానం చేసినప్పుడైనా దాన్ని స్వాగతించి సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సహేతుకమైన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది’’ అని రేవంత్ అన్నారు.
తీర్మానంపై రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్నవాళ్లకు బాధ ఉండొచ్చు. రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాం.. లెక్కలు బయటకు వస్తే 50 శాతం జనాభా ఉన్నవాళ్లకు రాజ్యాధికారంలో ఎక్కడ భాగం ఇవ్వాల్సి వస్తుందోనన్న బాధ ఉంటుందేమో. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు ఎలాంటి అనుమానం లేదు.. కానీ సహవాస దోషం అన్నట్టుగా కొంతమంది పక్కన కూర్చోవడంతో ఆయన్నూ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.