Hyd, Feb 15: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరో రోజు ప్రారంభం అయ్యాయి. బీజేపీఎల్ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ రోజు సమావేశాల్లో (TS Assembly Session) కాగ్ రిపోర్టును (CAG Report) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను కాగ్ రిపోర్ట్ పొందుపరిచింది.
డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా అంచనా వ్యయం రూ.1,06,000 కోట్లకు పెంచారని, ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని కాగ్ రిపోర్ట్ తెలిపింది.
ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని, ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించినట్టు కాగ్ రిపోర్టు పేర్కొంది. రూ.87 వేల కోట్లు సమకూర్చుకునేందుకు 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారని, బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని కాగ్ రిపోర్ట్ తెలిపింది.
రుణాలు చెల్లింపులో కాలయాపన చేసిందని ప్రస్తావించింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.700 కోట్ల నుంచి రూ.14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, రుణాల చెల్లింపు కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో వివరిందింది. కాళేశ్వరం అప్పు చెల్లించుకుంటూ పోతే 2036లో పూర్తవుతుందని కాగ్ నివేదిక అంచనా వేసింది. అప్పటి బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తక్కువగా ఉందని వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన కొన్ని పనులు నిరర్థకంగా మారాయని తెలిపింది. దీంతో రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని తన రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను అనవసరంగా చేపట్టినట్లు అయిందని, దీనికి అదనంగా రూ.25 వేల కోట్లు ఖర్చయిందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి లేదు. విభజన ఆస్తుల పంపకాలపై తగినంత దృష్టి పెట్టలేదు. రూ.1.18లక్షల కోట్ల రుణాలను బడ్జెట్లో పేర్కొనలేదు. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుంది. రుణాలపై 2032-33 నాటికి రూ.2.52లక్షల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.విద్య, వైద్యం, నీటిపారుదల తదితర రంగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.
కాళేశ్వరం పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. అవసరం లేకున్నా మూడో టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల రూ.25వేల కోట్లు అదనంగా ఖర్చయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51శాతంగా అంచనా వేశారు.. కానీ అది 0.75 శాతంగా తేలుతోంది. అది మరింత తగ్గే అవకాశముంది. భూకంప సంబంధిత అధ్యయనాలు సమగ్రంగా చేయకుండానే మల్లన్న సాగర్‌ను నిర్మించారు’’ అని నివేదికలో కాగ్ పేర్కొంది.
ఆసరా పింఛన్ల పంపిణీపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పంపిణీలో అవకతవకలు జరిగాయని తేల్చింది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్ ఆధారంగా కాగ్ నివేదికను రూపొందించింది.సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. ఆసరా డేటా బేస్, సమగ్ర కుటుంబ సర్వే మధ్య వ్యత్యాసం ఉంది. వినియోగించని మొత్తం బ్యాంకు ఖాతాలో ఉంది.. కానీ సెర్ప్ మాత్రం పూర్తిగా చెల్లించినట్లు నివేదిక ఇచ్చింది. 2018-21 మధ్య కాలంలో సగటున నెలకు 2.3లక్షల మందికి చెల్లింపులు జరగలేదు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా పింఛన్లు జారీ చేశారు.
దరఖాస్తు, పరిశీలన, ఆమోదానికి సంబంధించి సరైన విధానం పాటించలేదు. దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళల పింఛన్లలో రూ.535కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయి. మృతి చెందిన 367 మంది పేర్లను కూడా కొనసాగించి కొన్ని నెలలపాటు చెల్లింపులు జరిపారు. భూస్వాములు, కార్లు ఉన్న వాళ్లకు కూడా ఆసరా పింఛన్లు అందాయి. అనర్హులుగా గుర్తించినప్పటికీ 2లక్షల మందికి రూ.1175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు చేశారు. ఆసరా డేట్ బేస్ భద్రత విషయంలో సరైన మార్గదర్శకాలు పాటించలేదు. కీలకమైన సమాచామంతా బ్యాకప్ లేకుండా ఒకే చోట ఉంచారు’’అని కాగ్ పేర్కొంది.
పంచాయతీ రాజ్ శాఖపై కాగ్ రిపోర్టు: ‘‘గ్రాంట్ల మళ్ళింపు జరిగింది. నిధుల దుర్వినియోగం జరిగింది. బకాయిలు వసూలు చేయలేకపోయారు. కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారు. సకాలంలో రికార్డులు సమర్పించలేదు’’ అంటూ కాగ్ రిపోర్టులో వెల్లడించింది.