Lions Test Corona Positive: దేశంలో జంతువులకు కూడా పాకిన కరోనా, తొలిసారిగా 8 ఏసియన్ సింహాలకు కరోనా పాజిటివ్ లక్షణాలు, హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్ మూసివేత, ఏపీలో అన్ని జూ పార్క్‌లు క్లోజ్
హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్‌లోని (Nehru Zoological Park (NZP) 8 సింహాలకు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు (Lions Test Corona Positive) ఉన్నట్లు జూ సిబ్బంది గుర్తించారు.
Hyderabad, May 4: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనుషుల నుంచి జంతవులకు కూడా కరోనావైరస్ సోకుతోంది. తెలంగాణలో కోవిడ్ వైరస్ లక్షణాలు తాజాగా జంతువుల్లో కూడా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్‌లోని (Nehru Zoological Park (NZP) 8 సింహాలకు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు (Lions Test Corona Positive) ఉన్నట్లు జూ సిబ్బంది గుర్తించారు.
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న 8 సింహాలకు సంబంధించిన శాంపిల్స్‌ను కరోనా నిర్థారణ పరీక్షల కోసం జూ అధికారులు సీసీఎంబీకి (CCMB) పంపించారు.ఇందుకు సంబంధించిన ఫలితాల్లో సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సెకండ్ వేవ్‌లో జంతువులకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. ఆదివారం నుంచి జూ పార్క్‌లో సందర్శకులకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాల మేరకు పార్క్‌లను మూసివేశారు. సీసీఎంబీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కాగా ఇది నిర్థారణ అయితే కరోనావైరస్ బారీన సింహాలు పడటం దేశంలో ఇదే తొలిసారిగా చెప్పవచ్చు.
పార్క్‌లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా.. ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు మహమ్మారి బారినపడ్డట్లు తెలుస్తోంది.
దేశంలో పెరుగుతున్న కరోనా పెరుగుదల నేపథ్యంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నెల 2న నెహ్రూ జూ ప్కార్‌తో పాటు పలు పార్క్‌లను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని ఓ జూలో ఎనిమిది పులులు, సింహాలు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత హాంగాంగ్‌లో కుక్కలు, పిల్లుల్లో వైరస్ లక్షణాలను గుర్తించారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్‌ల్లో జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది.