Coronavirus Update: తెలంగాణలో ఒక్క కరోనవైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఆసుపత్రుల్లో తనిఖీ నిర్వహించిన కేంద్ర వైద్యుల బృందం, పుకార్లను నమ్మొద్దని మంత్రి ఈటెల విజ్ఞప్తి
జలుబు, దగ్గు లక్షణాలతో ఇదివరకు అడ్మిట్ అయినవారు కాకుండా మంగళవారం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరిండెంట్ వెల్లడించారు....
Hyderabad, January 28: చైనా దేశం నుంచి ఇతర దేశాలకూ వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ (Novel Coronavirus) ప్రపంచదేశాలను వణికిస్తుంది. తెలంగాణ (Telangana) రాష్ట్రంలోనూ ఈ వైరస్ ప్రభావం కనిపిస్తుందని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, దిల్లీ నుంచి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) పంపిన వైద్యుల బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, అక్కడి వసతులను వారి పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే, వారికి అందించాల్సిన చికిత్సకు సంబంధించి ఆసుపత్రిలోని వైద్యులకు సూచనలు చేశారు. అనంతరం వారి సమక్షంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు అనురాధ మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో చేరినంత మాత్రానా కరోనావైరస్ సోకినట్లు పేర్కొన్నారు.
జలుబు, దగ్గు లక్షణాలతో ఇదివరకు అడ్మిట్ అయినవారు కాకుండా మంగళవారం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరిండెంట్ వెల్లడించారు. కరోనావైరస్ కు సంబంధించి ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
గతవారం చైనా (China) నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ డాక్టర్ జలుబు, దగ్గు లక్షణాలతో ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కరోనావైరస్ బారిన పడ్డారా? అనే అనుమానంతో అతడి రక్త నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షించగా "నెగెటివ్" అని తేలింది. ఇప్పటికే భారత్ లోని అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రాయాలలో కరోనావైరస్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ఇక కరోనావైరస్ గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Health Minister Etela Rajender) అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు కాలేదని మంత్రి స్పష్టం చేశారు. తమ ద్వారా ధృవీకరించబడని రిపోర్టులను, ఊహగానాల వార్తలను, పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.