Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసుపై విచారణకు హాజరవ్వండి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు.. మాజీ మంత్రి హరీశ్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి కూడా సమన్లు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది.
Hyderabad, Aug 6: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపించింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబరు 5న విచారణకు రావాలని కోర్టు స్పష్టం చేసింది.
ఎవరు ఈ కేసు వేశారు?
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై పోలీసులతో సమగ్ర విచారణ చేయించాలంటూ 2023 నవంబరు 7న భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి స్థానిక కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ ఆ కోర్టు కొట్టివేయగా.. పిటిషనర్ ఇటీవలే భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ప్రజాధనంతో నిర్మితమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని, దీనిపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన పిటిషన్ ను కోర్టు పరిశీలించింది. తాజాగా నోటీసులు పంపించింది.