Telangana: తెలంగాణలో కరోనా సోకిన నిండు గర్భినీకి ప్రత్యేక జాగ్రత్తలతో డెలివరీ, రాష్ట్రంలో కొత్తగా మరో 10 పాజిటివ్ కేసులు, 1132కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, పరీక్షలు పద్ధతి ప్రకారమే జరుపుతున్నామని మంత్రి ఈటల పునరుద్ఘాటన

దీనిపై పసలేని వాదనలు చేయవద్దని సూటిగా చెప్పారు...

Telangana Health Minister Eatala Rajender | File Photo

Hyderabad, May 9: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1132కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి వచ్చినవే జిల్లాల నుంచి కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాలేదు.

గురువారం మరో 34 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 727 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. కొత్తగా కరోనా మరణాలేమి నమోదు కాలేదు, దీంతో మరణాల సంఖ్య 29 గానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 376 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ శుక్రవారం రాష్ట్రంలో గల కోవిడ్-19 పరిస్థితిని వివరించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాల్లో కరోనా కేసులు లేవు కాబట్టి వాటిని కూడా గ్రీన్ జిల్లాలుగా ప్రకటించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామని మంత్రి తెలిపారు. సూర్యాపేట,వరంగల్ అర్బన్,నిజామాబాద్ జిల్లాలను ఆరెంజ్ జోన్ లో చేర్చాలని కోరామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాలో మాత్రమే రెడ్ జోన్స్ ఉన్నాయి. వీటిల్లో కూడా హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని మంత్రి అన్నారు.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

మరో 14 జిల్లాలో కేసులు లేవు కాబట్టి వాటిని కూడా గ్రీన్ జిల్లాలుగా ప్రకటించాలని , అలాగే సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా కేసులు లేవు కాబట్టి ఆరంజ్ జోన్ జిల్లాలుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్లు ఈటల తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాత్రం రెడ్ జోన్ లో ఉన్నాయి . వీటిల్లో కూడా రూరల్ ప్రాంతంలో కేసులు లేవు అని మంత్రి అన్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయి అని అందుకే పరీక్షలు తక్కువ చేస్తున్నామని ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కు తెలియజేసినట్లు మంత్రి ఈటల స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని ఈటల తెలిపారు.

పరీక్షలు ఎవరికి పడితే వారికి చేయవద్దు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మార్గానిర్దేశకాలు ఇచ్చింది, పాజిటివ్ కేసులతో కలిసిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్ట్ చేయాలని,లక్షణాలు లేనివారిని 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచాలని.. అదే వయసు మళ్లిన వారు, ఇతర జబ్బులతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీ లకి పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎక్కువ కేసులు ఉన్నప్పుడు వారి కాంటాక్ట్ పర్సన్స్ ఎక్కువమంది ఉంటారు కాబట్టి ఎక్కువ పరీక్షలు చేశాము ఇప్పుడు తక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి తక్కువమందికి పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేంధర్ పునరుద్ఘాటించారు. దీనిపై పసలేని వాదనలు చేయవద్దని సూటిగా చెప్పారు.

గాంధీ ఆసుపత్రిలో కాలాపత్తర్ కి చెందిన 27 ఏళ్ల కరోనా సోకిన గర్భవతికి వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలతో సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. 3 కేజీల బాబు పుట్టారు. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాకుండా శుక్రవారం డిశ్చార్జ్ అయిన కరోనా బాధితుల్లో 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. అతడికి అనేక ఇతర అనారోగ్య సమస్యలతో పాటు డయాలసిస్ చేయించుకుంటూ చావు బ్రతుకుల్లో ఉన్నప్పటికీ కూడా కరోనా నుంచి పూర్తిగా బయటపడేసి, ఆరోగ్యంతో ఇంటికి పంపించినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలియజేశారు. గాంధీ వైద్యులు గొప్పగా పనిచేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఎక్కువ సజీవ సాక్ష్యం ఏం కావాలి అని మంత్రి అన్నారు.

కరోనా కేసులు తగ్గినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వవద్దని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠిన చర్యలు చేపట్టి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో 30 సర్కిల్ లు ఉంటే కేవలం 8 సర్కిల్ లలో మాత్రమే రెడ్ జోన్ లో ఉన్నాయని అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలుచేస్తున్నామని మంత్రి అన్నారు.

ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి వచ్చేవారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. ఎయిర్ పోర్టులోనే స్క్రీనింగ్ చేసి, లక్షణాలు ఉంటే పరీక్షలు చేస్తామని తెలిపారు. రోడ్డు మార్గంలో వచ్చేవారిని సరిహద్దు వద్దే చెక్ చేస్తున్నామని తెలిపారు. దేశంలో కోవిడ్ మరణాల కంటే ఆకలితో, నడిచి వెళ్ళేవారు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు కనుక తొందరగా సాధారణ స్థితి రావాలని కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి సేవలు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఓపి చూసుకోవాలని సూచించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.