COVID19 in TS: వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా డెల్టా వేరియంట్ కరోనా సోకుతుంది; తెలంగాణలో కొత్తగా 354 కోవిడ్19 కేసులు నమోదు, 427 మంది రికవరీ, 6,308కి తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా డెల్టా వేరియంట్ పాజిటివ్ కేసులు గుర్తించబడుతున్నట్లు తెలిపింది...
Hyderabad, August 23: కరోనావైరస్ యొక్క డెల్టా వేరియంట్ రకం వ్యాక్సిన్ పొందిన వారికి కూడా సోకుతుందని జాతీయ జన్యు ప్రయోగశాలల కన్సార్టియం పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా డెల్టా వేరియంట్ పాజిటివ్ కేసులు గుర్తించబడుతున్నట్లు తెలిపింది. ఈ ప్రకారం ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నా వారు కోవిడ్ బారి నుండి 100 శాతం రక్షణ పొందినట్లు కాదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని జన్యు ప్రయోగశాలల కన్సార్టియం హెచ్చరించింది. అయితే, కోవిడ్ వ్యాక్సిన్‌ల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, వ్యాక్సిన్ వేసుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకున్న వారికి కోవిడ్19 వ్యాధి తీవ్రత తక్కువ ఉండి, మరణం మరియు హాస్పిటలైజేషన్‌ను తగ్గించడంలో వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు వెల్లడించారు.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,634 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 354 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,441 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,55,343కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 32 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,861కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 427 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,45,174 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,308 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.