Telangana Encounter: దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక మలుపు, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు న్యాయవాదులు, ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటున్న న్యాయవాదులు

నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Disha Case Encounter petition-filed-supreme-court-disha-accused-encounter (Photo Credits: ANI)

New Delhi, December 7: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిషా హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌(Disha Case Encounter)పై సుప్రీంకోర్టు(Supreme court)లో పిటిషన్ దాఖలైంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులు నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌(Encounter)లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని న్యాయవాదులు జీఎస్‌ గనీ, ప్రదీప్‌ కుమార్‌లు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌ సందర్భంగా 2014లో అత్యున్నత న్యాయస్థానం రూపొందించిన మార్గదర్శకాలను పోలీసులు విస్మరించారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సుప్రీంకోర్టులో పిటిషన్‌

కాగా ఎన్‌కౌంటర్‌ ఉదంతానికి సంబంధించి శుక్రవారం షాద్‌ నగర్‌ (Shad Nagar) పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. దిషా కేసు (Disha Case) దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్‌ నగర్‌ ఏసీపీ వి.సురేంద్ర ఫిర్యాదు మేరకు హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్‌ 307) కింద కేసు నమోదు చేశారు. ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు కూడా విచారణ ప్రారంభించారు. నేడు వారు చటాన్ పల్లిలో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

చటాన్‌పల్లి వద్ద శుక్రవారం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో దిషా హత్యాచార నిందితులు చనిపోయారు. సీపీ సజ్జనార్ కథనం ప్రకారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తుపాకులు లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపారు. ఎంత వారించినప్పటికీ వాళ్లు వినకపోయేసరికి చివరకు పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో నిందితులు నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం, పలు మహిళా సంఘాలు ఎన్‌కౌంటర్‌ను తప్పు పడుతున్నాయి. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల్ని ఎలా చంపేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరం ప్రక్రియలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు గతంలో అభిప్రాయపడింది. దీని కొరకు ఐదేళ్ల కిందట పలు మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని తప్పక పాటించాలని ఆదేశాలు జారీచేసింది.