Cyberabad CP VC Sajjanar on today's encounter | Photo: ANI

Hyderabad, December 06: దిశ అత్యాచారం, హత్య ఘటన (Disha Case)లో సంబంధం ఉన్న నలుగురు నిందితులు మహమ్మద్ పాషా అలియార్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్ మరియు చింతకుంట చెన్నకేశవులు శుక్రవారం ఉదయం సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ఎన్ కౌంటర్ (Encounter) లో హతమయ్యారు.

ఎన్‌కౌంటర్ జరిగిన తీరును సైబరాబాద్ కమీషనర్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) మీడియాకు వివరించారు.

సజ్జనార్ మాటల్లో... నవంబర్ 27 రాత్రి తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో దిశ అనే వెటర్నరీ డాక్టర్‌ను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం జరిపి, ఆపై హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నవంబర్ 28 తెల్లవారు ఝామున చటాన్‌పల్లి వంతెన వద్దకు తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.  షాద్‌నగర్ ఏసీపీ ఈ కేసు టేకప్ చేశారు. క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలతో, అక్కడ లభించిన మరికొన్ని ఆధారాలతో షాద్‌నగర్ ఏసీపీ తన బృందంతో దర్యాప్తు ప్రారంభించారు. అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా, లభించిన సమాచారంతో  మఖ్తల్ మండలం, నారాయణపేటకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశాం.  ఆ నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్ ఎ1, జొల్లు శివ ఎ2, జొల్లు నవీన్ ఎ3, చింతకుంట చెన్నకేశవులు ఎ4లుగా గుర్తించాము.

నవంబర్ 30న ఈ నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. కోర్ట్ ఆదేశాల మేరకు వారిని చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. మరోసారి జ్యూడిషియల్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా, డిసెంబర్ 02న ఆ నలుగురు నిందితులకు 10 రోజుల పాటు డిసెంబర్ 03 నుంచి డిసెంబర్ 12 వరకు జ్యుడిషియల్ కస్టడీకి  కోర్ట్ అనుమతించింది. ఈ క్రమంలో డిసెంబర్ 04, 05 తేదీలలో వారిని విచారించినపుడు అనేక విషయాలు వెల్లడించారు.

అందులో భాగంగా బాధితురాలికి సంబంధించి మొబైల్, పవర్ బ్యాంక్, గడియారం ఇతర వస్తువులు చేతన్ పల్లి వంతెన వద్ద దాచి పెట్టినట్లు చెప్పారు. దీంతో డిసెంబర్ 06, ఈరోజు తెల్లవారు ఝామున వారిని ఘటనాస్థలానికి తీసుకొచ్చాం. అయితే ఇక్కడి వచ్చిన తర్వాత దాచిపెట్టిన చోటును చూపకుండా ఇక్కడ పెట్టాం, అక్కడ పెట్టాం అని చెపుతూ కొద్దిసేపు సమయం వృధా చేశారు. ఆ తర్వాత నలుగురు ఏకమై కర్రలు, రాళ్లు మరియు ఇతర వస్తువులతో పోలీసులపై దాడి చేశారు. ఎ1 నిందితుడు మహ్మద్ ఆరీఫ్, ఎ4 చింతకుంట చెన్నకేశవులు, దర్యాపు బృందంలోని ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్‌ల తుపాకులు దొంగలించి వారిపై ఎక్కుపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు.

దొంగిలించిన తుపాకీతో ముందుగా ఆరిఫ్ ఫైరింగ్ ప్రారంభించాడు, ఆ తర్వాత చెన్నకేశవులు ఫైరింగ్ ప్రారంభించాడు. మిగతా ఇద్దరూ రాళ్లతో దాడి చేస్తూనే ఉన్నారు. పోలీసులు హెచ్చరించినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీస్ గ్రూప్ ఆత్మరక్షణ కోసం వారిపై ఎదురు కాల్పులు జరపడంతో ఆ నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఎస్సై మరియు కానిస్టేబుల్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని సజ్జనార్ వెల్లడించారు.

శుక్రవారం ఉదయం 5:45 నుంచి 6:15 వరకు ఈ కాల్పులు కొనసాగాయని సీపీ వివరించారు.  ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి అయితే బుల్లెట్ గాయాలు ఏమి కాలేదని వెల్లడించారు. ఆ నలుగురికి పోలీసులను ఎదిరించేంత శక్తి ఉందా? అని మీడియా అడిగినపుడు, వారు తీవ్రమైన నేరగాళ్లని, ఎంతకైనా తెగించగలరని సీపీ చెప్పారు. దిశ మాత్రమే కాదని, తెలంగాణ, ఏపీ మరియు కర్ణాటక రాష్ట్రాలలో కూడా జరిగిన నేరాలతో వీరికి సంబంధం ఉన్నట్లు మేము అనుమానిస్తున్నాం, వాటిపైనా దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.

ఇక ఈ కేసులో దిశ కుటుంబాన్ని విసిగించవద్దని, వారి ప్రైవసీని, వారి వ్యక్తిగత వివరాల గోప్యతను పాటించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఈ ఎన్‌కౌంటర్ వివరాలను ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమీషన్ మరియు ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలిపారు. కాగా, జాతీయ మానవహక్కుల కమీషన్ (NHRC) ఈ ఎన్‌కౌంటను  సుమొటోగా తీసుకొని తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీచేసింది.

ఈ విషయమై మీడియా.. సీపీ సజ్జనార్‌ను అడుగుతూ NHRCకి ఎలాంటి బదులిస్తారని ప్రశ్నించగా, " Law Has Done Its Duty" (చట్టం తన పని తాను చేసుకుపోయింది) అని సజ్జనార్ బదులిచ్చారు.