Telangana Paddy: యాసంగిలో వరి సాగు వద్దు, ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చేయమని తేల్చిచెప్పిన తెలంగాణ సర్కారు
ఈ యాసంగిలో రైతుల వరిసాగు చెయవద్దని స్ఫష్టం చేసింది. ఒకవేళ వరిసాగు చేస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని ప్రకటించారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.
Hyderabad November 06: తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక సూచనలు చేసింది. ఈ యాసంగిలో రైతుల వరిసాగు చెయవద్దని స్ఫష్టం చేసింది. ఒకవేళ వరిసాగు చేస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని ప్రకటించారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.
విత్తన వడ్లు సాగు చేసే రైతులు మిల్లర్లతో ఒప్పందం చేసుకుంటే నిరభ్యంతరంగా సాగుచేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఆశతో మాత్రం రైతులు వరి సాగు చేపట్టొద్దని.. తెలంగాణ ప్రభుత్వ విధానపర నిర్ణయమన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. వానాకాలంలో వరి సాగుపై ఎలాంటి వర్రీ అవసరం లేదన్నారు. ఎఫ్‌సీఐ కొనకున్నా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. దొడ్డు వడ్లయినా.. సన్న రకాలయినా ప్రభుత్వం కొంటుందన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం నానా యాగీ చేస్తుందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం చేతగానితనాన్ని రాష్ట్రాల మీద నెట్టివేస్తుందన్నారు. యాసంగిలో నూక శాతం ఎక్కువ ఉంటుందని, నూక లేని వరివంగాడల అభివృద్ధి కృషి చేస్తున్నామన్నారు. యాసంగి సాగును ఒక నెల ముందుకు జరుపుకోవాలని రైతులకు సూచించారు.
రైతులపై మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, సీఎం కేసీఆర్ నిండు మనసుతో వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆయన కృషి ఫలితంగానే తెలంగాణలో దిగుబడి పెరిగిందన్నారు. కష్టపడి సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకున్నామని చెప్పారు.