Singareni: సింగరేణిలో ప్రమాదం, పైకప్పు కూలి నలుగురు మృతి, సంతాపం తెలిపిన మంత్రులు, మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న సింగరేణి

గని పైకప్పు పనులు జరుగుతుండగా కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ డివిజన్‌ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

Manchiryal November 10: సింగరేణిలో ప్రమాదం జరిగింది. గని పైకప్పు పనులు జరుగుతుండగా కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ డివిజన్‌ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో గనిలోని 21 డిప్‌ 24 లెవల్‌, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్‌ బేర లచ్చయ్య (60), సపోర్ట్‌మెన్‌ వీ క్రిష్ణారెడ్డి (59), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు (30), రెంక చంద్రశేఖర్‌(30)కార్మికులు బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే మరణించారు.

ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీంతో సహాయక చర్యలు చేపట్టారు. గనిపై కప్పు 14 మీటర్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల మందంతో కూలిందని అధికారులు తెలిపారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని టీబీజీఎకేఎస్ నాయకులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

ప్రమాదంపై మంత్రులు హ‌రీశ్‌రావు, అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతి దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

అటు గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌ శ్రీధర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన కార్మికుల కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నామని ప్రకటించారు. అలాగే గని మ్రాదంలో మృతి చెందిన కార్మికులకు యాజమాన్యం తరపున చెల్లించే మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు అందజేయనున్నామని తెలిపారు.